ఫిఫా ప్రపంచ కప్: పాపం మెస్సి.. అర్జెంటీనా విజయాలను వెంటాడిన వివాదాలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 02:09 PM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా సాధించిన విజయాలన్నింటినీ వివాదాలే వెంటాడాయి. రెడ్ కార్డ్‌ల నుంచి రిఫరీ నిర్ణయాలు ఆ జట్టుకే అనుకూలంగా ఉన్నాయంటూ వచ్చిన విమర్శల వరకు ఏదో ఒక వివాదం అర్జెంటీనాకు ఇబ్బందిగానే మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా సాధించిన విజయాలన్నింటినీ వివాదాలే వెంటాడాయి. రెడ్ కార్డ్‌ల నుంచి రిఫరీ నిర్ణయాలు ఆ జట్టుకే అనుకూలంగా ఉన్నాయంటూ వచ్చిన విమర్శల వరకు ఏదో ఒక వివాదం అర్జెంటీనాకు ఇబ్బందిగానే మారింది. అయినప్పటికీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు.. అద్భుత ప్రదర్శననే కనబర్చింది. కెప్టెన్ లియోనెల్ మెస్సి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసే సరకు మెస్సి ముఖంలో కనిపించిన బాధ ఫుట్‌బాల్ అభిమానులను కదిలించింది. రెండో ప్రపంచ కప్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిన అర్జెంటీనా.. అదనపు సమయంలో గోల్ సమర్పించుకుని స్పెయిన్ చేతిలో ఓటమి పాలవ్వడంతో మెస్సి కల నెరవేరలేదు. దీంతో మైదానంలోనే భావోద్వేగానికి గురయ్యాడు.
మరోవైపు అర్జెంటీనా ఆటగాళ్ల ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్పెయిన్ డిఫెండర్ ఎరిక్ గార్సియాను తోసివేసిన లియాండ్రో పరేడెస్‌కు రెడ్ కార్డు చూపించారు. దీంతో ఫైనల్‌లో అర్జెంటీనా ఆటతీరు మరోసారి చర్చనీయాంశమైంది. టోర్నీ మొత్తం మెస్సి తన అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరించినా, అర్జెంటీనా విజయాలన్నింటినీ వివాదాలు వెంటాడాయి. ఈజిప్టుపై విజయంలో రిఫరీ నిర్ణయాలపై విమర్శలు రావడం, జోర్డాన్‌తో మ్యాచ్‌లో మెస్సి రెడ్ కార్డు నుంచి తప్పించుకున్నాడన్న చర్చ, దూకుడు ఆటతీరు... ఇలా ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక వివాదం చోటుచేసుకుంది.

నిరాశపరిచిన మెస్సి
ఫైనల్లో మెస్సి నుంచి ఆశించిన స్థాయి ప్రదర్శన రాలేదు. కొన్ని క్రాస్‌లు, ఒక ప్రమాదకర షాట్, స్పెయిన్ డిఫెండర్ మార్క్ కుకురెల్లాకు రెడ్ కార్డు ఇప్పించాలని చేసిన ప్రయత్నం మినహా అతని ప్రభావం పెద్దగా కనిపించలేదు. గోల్డెన్ బూట్ రేసులో తీవ్రమైన పోటీ ఇచ్చిన మెస్సి.. ఆఖరి రెండు మ్యాచుల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం గమనార్హం. తన కెరీర్‌లో ఎన్నో అద్భుత విజయాలను జట్టుకు అందించిన మెస్సికి.. ఈ ప్రపంచ కప్ ఆశించిన ముగింపు కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

ఇవి కూడా చదవండి:
ఫిఫా ఫైనల్: చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడు.. మెస్సిపై విమర్శల జల్లు
అలా అయితేనే ఆటలో కిక్.. రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ