ఫిఫా ఫైనల్ వేళ కలకలం.. విమానాన్ని తరిమికొట్టిన ఎఫ్-16 ఫైటర్ జెట్లు
ABN , Publish Date - Jul 20 , 2026 | 02:38 PM
అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఫిఫా ప్రపంచకప్ 026 ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన ఈ తుది పోరుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. దీంతో..
స్పోర్ట్స్ డెస్క్: అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఫిఫా ప్రపంచకప్ 026 ఫైనల్ జరిగిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగిన ఈ తుది పోరుకు (FIFA World Cup) యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలోని బెడ్‌మిన్‌స్టర్, ఈస్ట్ రూథర్‌ఫర్డ్ ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాక ఆ ప్రాంతాల్లోని గగనతలలో విమానాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించి మ్యాచ్ జరిగే ప్రాంతంలోని గగనతలలో కొన్ని విమానాలను ఎఫ్-16 ఫైటర్ జెట్లు తరిమాయి. ఈ విషయాన్ని నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆంక్షలు ఉన్న ప్రాంతంలోకి 10కి పైగా పౌర విమానాలు ప్రవేశించాయని, వీటిల్లో కొన్ని తమ పొరపాటును గుర్తించి దారిమళ్లాయని అధికారులు తెలిపారు. అయితే మరో మూడు విమానాలను మాత్రం తాము అడ్డుకొని, పంపించాల్సి వచ్చిందని డిఫెన్స్ కమాండ్ వెల్లడించింది. రెండు సందర్భాల్లో పైలట్లను హెచ్చరించేందుకు మంటలు వెలువరించాల్సి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. దేశాధినేత భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అలానే ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఫైటర్ జెట్లు ఆ మంటలు వెలువరించాయని రక్షణ దళ అధికారులు తెలిపారు.
ఈస్ట్ రూథర్‌ఫర్డ్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో స్పెయిన్- అర్జెంటీనా మధ్య నువ్వానేనా అన్నట్టు జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ట్రంప్ (Donald Trump) వీక్షించారు. ఈ మ్యాచ్ సమయంలో స్టేడియంలో ప్రపంచస్థాయి క్రీడాకారులు, ప్రముఖులు, భారీ సంఖ్యలో ఫుట్‌బాల్ అభిమానులు ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి.. విశ్వ విజేతగా నిలిచింది. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలోకి రావడానికి ముందు ట్రంప్ కొద్దిసేపు విహంగ వీక్షణం చేశారు.
ఇవీ చదవండి:
ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?
ఫిఫా పోడియంపై ట్రంప్ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో