Share News

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:15 PM

స్పెయిన్ యువ సంచలనం యమాల్ తన విజయం వెనుక ఉన్న తన కుటుంబ త్యాగాలను గుర్తు చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ స్పెయిన్ ఆటగాడు.. తన ఎదుగుదల వెనుక నానమ్మ ఫాతిమా చేసిన పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!
Lamine Yamal

ఇంటర్నెట్ డెస్క్: లామినె యమాల్.. ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్పెయిన్ తరఫున చేసింది ఒక్కటే గోల్.. కానీ అతడి పేరు ఇప్పటికీ మార్మోగిపోతోంది. 18 ఏళ్లకే ఫిఫా కప్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా నిలిచి రికార్డు నెలకొల్పాడు. ఫుట్‌బాల్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోన్న ఈ యువ స్టార్ యమాల్.. తన విజయం వెనుక ఉన్న తన కుటుంబ త్యాగాలను గుర్తు చేసుకున్నాడు. బార్సిలోనా తరఫున మెరుపులు మెరిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ స్పెయిన్ ఆటగాడు.. తన ఎదుగుదల వెనుక నానమ్మ ఫాతిమా చేసిన పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలు, కుటుంబం పడిన ఇబ్బందులు తనను మరింత బలంగా తీర్చిదిద్దాయని యమాల్ తెలిపాడు.


‘నాకు అప్పుడు మూడేళ్లు. మా నానమ్మ ఫాతిమా.. మొరాకో నుంచి స్పెయిన్‌కు వలస వచ్చారు. ఒంటరిగా మా కుటుంబాన్ని మొత్తం ఆమె చూసుకునేవారు. రేయింబవళ్లు కష్టపడి మమ్మల్ని పోషించారు. మా భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మా నాన్న, ఆయన సోదరి మొరాకోలో ఉండగా వారిని స్పెయిన్‌కు తీసుకురావడానికి డబ్బు కూడబెట్టింది’ అని యమాల్ తెలిపాడు. ప్రస్తుతం బార్సిలోనా జెర్సీలో ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆకర్షిస్తున్న యమాల్ చిన్నతనం మాత్రం అంత సులభంగా సాగలేదు. కాటలోనియాలోని రొకాఫోండా అనే ప్రాంతంలో సాధారణ కుటుంబంలో పెరిగాడు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని తన గుర్తింపుగా భావించే యమాల్.. గోల్ చేసిన ప్రతిసారీ ఓ ప్రత్యేక సంజ్ఞ ద్వారా అక్కడి పోస్టల్ కోడ్‌ను గుర్తు చేసుకుంటాడు.


ఎన్నో ఇబ్బందులు పడి..

యమాల్ తల్లి ఈక్వటోరియల్ గినీ. యమాల్‌కు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే భర్తతో విడిపోయింది. తల్లితోనే ఉండే యమాల్.. అప్పుడప్పుడు తండ్రి కోసం కాటాలోనియా వెళ్తుండేవాడు. ఆమె వెయిట్రెస్‌గా పనిచేసేవారు. ‘మా అమ్మతో గడిపే సమయం చాలా తక్కువ. కానీ రాత్రిపూట ఎంత లేటైనా మా కోసం భోజనం సిద్ధం చేసేది. స్కూల్‌కు వెళ్లడం, ఇంటికి రావడం, మళ్లీ ట్రైనింగ్‌కు వెళ్లడమే నా దినచర్య. ఎప్పుడో రాత్రికి మా అమ్మను చూసేవాడిని’ అని యమాల్ ఓ సందర్భంలో చెప్పాడు.

Yamal.jpg


అదే అసలైన విజయం

బార్సిలోనా అకాడమీ లా మాసియా నుంచి వచ్చిన యమాల్ కేవలం 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ యువ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచినా, తనకు నిజమైన ఆనందం కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండటమేనని చెబుతున్నాడు. ‘మా అమ్మ సంతోషంగా ఉండటం చూస్తున్నా. నా తమ్ముడు నేను పొందలేని బాల్యాన్ని అనుభవించడం చూస్తున్నా. అదే నాకు అత్యంత ఆనందం. మా నాన్న ప్రశాంతంగా ఉండటం, నాన్నమ్మ తన ఇంట్లో సంతోషంగా ఉండటం... ఒక పిల్లవాడు తన కుటుంబం కోసం ఇంతకంటే గొప్పగా ఏం కోరుకోగలడు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటినే బలంగా మార్చుకున్నా. నా తల్లిదండ్రులు, మా నానమ్మకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ యమాల్ భావోద్వేగానికి గురయ్యాడు.

lamin.jpg


ఇవి కూడా చదవండి:

ఫిఫా ఫైనల్: చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడు.. మెస్సిపై విమర్శల జల్లు

అలా అయితేనే ఆటలో కిక్.. రిటైర్‌మెంట్ వార్తలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ

Updated Date - Jul 20 , 2026 | 04:45 PM