నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో..
ABN , Publish Date - Jul 21 , 2026 | 10:46 AM
లష్కర్ బోనాల పండుగ అంటే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు.
తరతరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ
సికింద్రాబాద్: లష్కర్ బోనాల పండుగ అంటే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు. ఈ పండుగకు నగరం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనార్ధం భక్తులు వస్తుంటారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ ఉత్సవాల్లో పలు వృత్తులవారు, కులాలవారు సేవలందించడం ఆనవాయితీగా వస్తోంది. సంవత్సరమంతా ఎక్కడ ఉన్నా ఈ ఆషాఢ మాసం మొదలయిందంటే అమ్మవారి సేవకు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో తమ పనుల్లో నిమగ్నమవుతారు. అమ్మవారికి పలు కులాల వారు తమకు తోచిన విధంగా సేవలందిస్తుంటారు. అందులో ప్రధానంగా బ్రాహ్మణ, ముదిరాజ్, కుమ్మరి, చాకలి ఇలా పలు కులాలవారు సేవలు చేస్తుంటారు.
పోతరాజుగా..
పదిహేను సంవత్సరాలుగా పోతరాజుగా అమ్మవారికి సేవ చేస్తున్నా. సురిటి కామేశ్వర్ ముదిరాజ్ ఈ అవకాశం కల్పించారు. గతంలో పోతరాజు దినే్‌షతో కలిసి సేవ చేసేవాడిని. ప్రస్తుతం దేవరాజ్, నర్సింగ్, భాస్కర్‌లతో కలిసి పోతరాజులుగా సేవలందిస్తున్నాం. అమ్మవారి ఘటోత్సవం రోజు అమ్మవారిని ఆలయానికి తీసుకువచ్చినప్పటి నుంచి భవిష్యవాణి అనంతరం అమ్మవారిని సాగనంపే వరకు సేవలు అందిస్తుంటాం.
రాయకుంట శ్రీనివాస్, పోతరాజు
వీధుల్లో డప్పు వాయిస్తుంటా..
ఏ రోజు, ఏ బస్తీలో ఘటం వస్తుందో ఆ రోజు తెల్లవారుజామునే డప్పు వాయిస్తూ అమ్మవారి రాకను అందరికీ తెలిసేలా చేస్తుంటా. దీంతో బస్తీవాసులు అమ్మవారి రాకకు ఎదురుచూస్తుంటారు. ఘటం రూపంలో అమ్మరాగానే సాకలు పోసి, ఒడి బియ్యాన్ని భక్తులు సమర్పిస్తుంటారు. నాలుగు తరాలుగా అమ్మవారికి మా వంశం ఈ సేవలను అందిస్తుంది.
రామారావు, డప్పు చాటింపుదారు
అమ్మవారి సేవలో మా కుటుంబం
దాదాపు 50 ఏళ్లుగా వంశపారంపర్యంగా అమ్మవారి సేవలో మా కుటుంబం కొనసాగుతుంది. మా తాత, మా తండ్రి అమ్మవారి సేవలో కొనసాగేవారు. మేము ఘటం వెంట తిరిగి ఒడి బియ్యాన్ని సేకరిస్తాం. రంగం రోజు ముందుగా బలిగంపకు అవసరమయ్యే వస్త్రాలు, జల్లకడవను తీసుకువస్తాం. మా తండ్రి తదనంతరం గత సంవత్సరం నుంచి నేనే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా.
చాకలి మహేష్
అమ్మవారి సేవలో..
36 సంవత్సరాలుగా అమ్మవారి సేవలో ఉన్నా. 1999లో నేను కూడా ఇక్కడ అర్చకునిగా చేరి ప్రస్తుతం ప్రధాన అర్చకునిగా అమ్మవారి సేవలో కొనసాగుతున్నా. అమ్మవారి దయతో స్మార్తము, కాళీ, బాలత్రిపుర సుందరి, మాతంగేశ్వరి, ఛండీ నవక్షరి ఉపదేశం, అక్షర లక్షల జపం వంటివి నేర్చుకున్నా.
బి.రామతీర్థ శర్మ, ప్రధాన అర్చకులు
మాది ఏడవ తరం..
అమ్మవారిని మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి తీసుకువచ్చింది మా ముత్తాత సురిటి అప్పయ్య. మేము ఆయనకు ఏడవ తరం. ప్రస్తుతం సురిటి కామేశ్వర్ ముదిరాజ్, మా తమ్ముడు సురిటి రామేశ్వర్ ముదిరాజ్ అమ్మవారి సేవలను కొనసాగిస్తున్నాం. ఎదుర్కోలు నుంచి బోనాలు, అమ్మవారిని సాగనంపే వరకు మేమే ఆయా కులాల వారితో పనులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేయిస్తాం.
సురిటి కామేశ్వర్ ముదిరాజ్, ఆలయ అనువంశిక ధర్మకర్త
తొలి బోనం సమర్పణ వరకు..
ఘటం ఎదుర్కోలు నుంచి బోనాల పండుగ వరకు ఘటం వెంటే తిరుగుతా. నాకు 8 ఏళ్ల వయస్సు నుంచి సేవలు చేస్తున్నా. అమ్మవారికి తొలి బోనం సురిటి వంశస్తుల తరపున నేనే సమర్పిస్తుంటా.
మర్రి లక్ష్మి, సురిటి లక్ష్మయ్య కుమార్తె
అంబారీ ఊరేగింపు..
నేను 39 సంవత్సరాలుగా అమ్మవారి సేవను చేస్తున్నా. ప్రతి ఏటా భవిష్యవాణి అనంతరం ఏనుగు అంబారి ఊరేగింపుకు అయ్యే ఖర్చు మేమే భరిస్తాం. ఏనుగును తెప్పిస్తున్నామని అందరూ అంబారి రాజు అని పిలుస్తుంటారు. మూడు సంవత్సరాలుగా ఏనుగును తీసుకువచ్చే ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ వారం పాటు ఏనుగుకు అయ్యే దానా, వైద్యుడు, మావటి ఖర్చులు మొత్తం మేమే భరిస్తాం. ఇది అమ్మవారు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తుంటా.
నరేష్ కుమార్, అంబారీని ఏర్పాటు చేసే వ్యక్తి
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News