కోహ్లీ సలహా సింధు ఆటను మార్చేసింది: దత్త సాయి
ABN , Publish Date - Jul 21 , 2026 | 09:45 AM
జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఆమె విజయం వెనుక కఠిన సాధనతో పాటు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక సలహా కీలక పాత్ర పోషించిందని సింధు భర్త వెంకట దత్త సాయి వెల్లడించారు.
స్పోర్ట్స్ డెస్క్: దాదాపు రెండేళ్లుగా పెద్ద టైటిల్ కోసం ఎదురుచూసిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు.. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలుచుకుని ఘనంగా పునరాగమనం చేసింది. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సింధు విజయం వెనుక కఠిన సాధనతో పాటు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇచ్చిన ఒక సలహా కీలక పాత్ర పోషించిందని ఆమె భర్త వెంకట దత్త సాయి వెల్లడించారు.
ఫామ్ కోల్పోయిన సమయంలో శతకం కోసం సుదీర్ఘ నిరీక్షణను ఎలా అధిగమించారని సింధు కోహ్లీని అడగగా.. 'పరుగులు చేయడమే తన పని అని, అందులోనే ఆనందాన్ని ఆస్వాదించడం ప్రారంభించాను' అని అతడు చెప్పినట్లు దత్త సాయి తెలిపారు. అదే ఆలోచనను బ్యాడ్మింటన్‌కు అన్వయించి, ఆటపై సింధులో మళ్లీ ఆసక్తి, ఆనందాన్ని పెంపొందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కాలివేలి గాయం కారణంగా వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న సింధును అమెరికాలోని అట్లాంటాలో పునరావాస శిక్షణకు తీసుకెళ్లి శారీరక, మానసికంగా సిద్ధం చేసినట్లు దత్తసాయి వెల్లడించారు.
పారిస్ ఒలింపిక్స్ అనంతరం సింధు ఆటతీరుపై స్పోర్ట్స్ సైన్స్ ఆధారంగా విశ్లేషణ జరిపామని తెలిపాడు. దూకుడుగా ఆడటం తగ్గించి, అవసరానికి మించి లైన్ కాల్స్‌పై ఆధారపడటం వంటి లోపాలను గుర్తించి వాటిపై ప్రత్యేకంగా పనిచేశామని దత్త సాయి వివరించారు. కోచ్‌లు, ఫిట్‌నెస్ నిపుణుల సూచనల మేరకు సింధు సుమారు 3.5 కిలోల బరువు తగ్గడంతో పాటు ఆహార నియమాలు కూడా కచ్చితంగా పాటించిందన్నారు. ఈ సమష్టి కృషి ఫలితంగానే జపాన్‌కు చెందిన అకానే యమగుచిని నేరుగా రెండు గేమ్‌ల్లో ఓడించి టైటిల్ సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయంతో సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌లో మరోసారి తన సత్తా చాటడంతో పాటు వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి:
రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి తొలగించలేరు: అశ్విన్
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, కోచ్ కెవిన్ కీగన్ కన్నుమూత