ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, కోచ్ కెవిన్ కీగన్ కన్నుమూత
ABN , Publish Date - Jul 21 , 2026 | 07:14 AM
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ మేనేజర్ కెన్ కీగన్ (75) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ మేనేజర్ కెన్ కీగన్ (75) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన సోమవారం తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది సంభవించిన ఒక రోడ్డు ప్రమాదం తర్వాత కెవిన్ పొత్తికడుపు సంబంధిత సమస్య తలెత్తింది. ఆ సమయంలో వైద్యులు పరీక్షించగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది మే నెలలో న్యూక్యాసిల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తానూ స్టేజ్-4 క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.
స్కన్‌థోర్ప్ యునైటెడ్‌తో తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ప్రారంభించిన కీగన్, వివిధ క్లబ్‌ల తరఫున దాదాపు 600 లీగ్ మ్యాచ్‌లు ఆడారు. 1970ల కాలంలో లివర్‌పూల్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించి, మూడు ఫస్ట్ డివిజన్ టైటిళ్లను అందించడంలో కీలక పాత్ర పోషించారు. జర్మనీకి చెందిన హ్యాంబర్గ్ క్లబ్‌లో ఉన్నప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘బెలన్ డి ఓర్’ (Ballon d'Or) పురస్కారాన్ని వరుసగా రెండుసార్లు దక్కించుకుని చరిత్ర సృష్టించారు.
సాకర్ దిగ్గజంగా పేరుగాంచిన ఆయన, ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 63 మ్యాచ్‌ల్లో 21 గోల్స్ సాధించారు. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా, 1999 నుంచి 2000 వరకు ఇంగ్లాండ్ జాతీయ జట్టు మేనేజర్‌గా సేవలు అందించారు. అలాగే న్యూక్యాసిల్ యునైటెడ్ క్లబ్‌కు ఆటగాడిగానే కాక రెండుసార్లు మేనేజర్‌గా కూడా వ్యవహరించారు. సౌతాంప్టన్, ఆస్ట్రేలియాకు చెందిన బ్లాక్‌టౌన్ సిటీ వంటి క్లబ్‌లకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహించారు. కీగన్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘ఆల్ ఇంగ్లండ్ జూనియర్’ చాంపియన్ సాయి