Share News

గాల్లో కాల్పులు.. జువెల్లరీ షాపులో సినీ ఫక్కీ దోపిడీ.. వైరల్ వీడియో

ABN , Publish Date - Jul 21 , 2026 | 07:10 AM

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పట్టపగలే బంగారం దుకాణంలో జరిగిన దోపిడీ కలకలం రేపింది. నాటు తుపాకులు, రైఫిళ్లతో వచ్చిన ముగ్గురు దుండగులు జువెల్లరీ షాపులోకి చొరబడి లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

గాల్లో కాల్పులు.. జువెల్లరీ షాపులో సినీ ఫక్కీ దోపిడీ.. వైరల్ వీడియో
Maharashtra Jewellery Robbery

మహారాష్ట్ర: పాల్ఘర్ జిల్లాలో పట్టపగలే బంగారం దుకాణంలో జరిగిన దోపిడీ కలకలం రేపింది. నాటు తుపాకులు, రైఫిళ్లతో వచ్చిన ముగ్గురు దుండగులు జువెల్లరీ షాపులోకి చొరబడి లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి నిర్భయంగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


సోమవారం సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పాల్ఘర్‌లోని లక్ష్మీ జువెల్లర్స్‌లో ఈ దోపిడీ జరిగింది. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన ముగ్గురు దుండగులు ద్విచక్రవాహనంపై షాపు వద్దకు చేరుకుని లోపలికి ప్రవేశించారు. అనంతరం సిబ్బందిని తుపాకులతో బెదిరించి షోకేసుల్లో ఉన్న బంగారు నగలను ప్లాస్టిక్ సంచుల్లో నింపుకున్నారు. దోపిడీ అనంతరం ఎవరూ అడ్డుకోకుండా ఉండేందుకు దుండగులు గాల్లోకి పలుమార్లు కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దాలతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం దుండగులు అదే బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను వెంబడించినప్పటికీ వారు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులు చిత్రీకరించిన మొబైల్ వీడియోల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా, దోపిడీ అనంతరం దుండగులు చేతుల్లో తుపాకులు, ప్లాస్టిక్ సంచులతో ఎలాంటి భయం లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

కదం తొక్కిన కాక్రోచ్‌

మోదీ.. మోస్ట్‌ యాంటీ యూత్‌ ప్రధాని

Updated Date - Jul 21 , 2026 | 07:22 AM