Share News

మోదీ.. మోస్ట్‌ యాంటీ యూత్‌ ప్రధాని

ABN , Publish Date - Jul 21 , 2026 | 06:16 AM

న్యూఢిల్లీలో ‘చలో పార్లమెంట్‌’ మార్చ్‌ చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యార్థులపై పోలీసులు భాష్పవాయువు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జ్‌ చేయడం...

మోదీ.. మోస్ట్‌ యాంటీ యూత్‌ ప్రధాని

  • సీజేపీ మార్చ్‌పై బలప్రయోగం హేయం: రాహుల్‌ గాంధీ

  • పార్లమెంటు ఎవరి సొత్తు కాదు: ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ, జూలై 20: న్యూఢిల్లీలో ‘చలో పార్లమెంట్‌’ మార్చ్‌ చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యార్థులపై పోలీసులు భాష్పవాయువు గోళాలు ప్రయోగించడం, లాఠీచార్జ్‌ చేయడం ఎంత మాత్రం ప్రజాస్వామ్యం కాదని, అది భారతదేశ విధానం అస్సలే కాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. సోమవారం ఒక వీడియో సందేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ రోడ్లపై నిరసన తెలుపుతున్న విద్యార్థులు నేరస్థులు కాదు. తమను గౌరవించే, నిష్పాక్షికమైన, సక్రమంగా పనిచేసే విద్యావ్యవస్థను అందించాలని వారు తమ హక్కుల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. యువత చేస్తున్న పోరాటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ప్రభుత్వం, పోలీసులు వారిపట్ల వ్యవహరించిన తీరు అత్యంత అసహ్యకరం. ప్రధాని మోదీ దేశ చరిత్రలోనే అత్యంత ‘యువజన వ్యతిరేక’ ప్రధానిగా మిగిలిపోతారు’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విద్యా విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. వాటిపై చర్చ జరగాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై భాష్పవాయువు గోళాలు ప్రయోగించడంతో పాటు దారుణంగా కొడుతున్నారు. ఎందుకు ఈ అణచివేత? వారు మన పిల్లలు, ఈ దేశ భవిష్యత్తు. ఈ పార్లమెంట్‌ వారికే చెందుతుంది తప్ప, ఎవరి వ్యక్తిగత సొత్తు కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి’’అని మండిపడ్డారు. కాగా, విద్యార్థులపై బలప్రయోగం చేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం తన అహంకారాన్ని పక్కన్నబెట్టి వారి సమస్యలను పరిష్కరించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.

Updated Date - Jul 21 , 2026 | 06:16 AM