Share News

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..

ABN , Publish Date - Jul 20 , 2026 | 09:53 AM

నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ నగర్‌లో ఆరేళ్ల చిన్నారి మిస్సింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. అయితే కొన్ని గంటల్లోనే చిన్నారి ఆచూకీ లభించడంతో పోలీసులతో పాటు, స్థానికులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..
Nandyal News

నంద్యాల, జులై 20: నంద్యాల పట్టణ శివారులోని వైఎస్ నగర్‌లో ఆరేళ్ల చిన్నారి మిస్సింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. అయితే కొన్ని గంటల్లోనే చిన్నారి ఆచూకీ లభించడంతో పోలీసులతో పాటు, స్థానికులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రణవి అనే చిన్నారి నిన్న(ఆదివారం) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బయటకు వెళ్లిపోయింది. కొద్దిసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీదేవి ఆందోళనకు గురైంది. వెంటనే ప్రణవి కోసం వైఎస్ నగర్ అంతా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో రాత్రి 9 గంటలకు 100కు కాల్ చేసి సమాచారం అందించింది. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి సంఘటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్ రాత్రంతా వైఎస్ నగర్‌లోనే మకాం వేశారు.


ప్రణవి కోసం దాదాపు 200 మంది పోలీసులు.. వైఎస్ నగర్, నందమూరి నగర్ ప్రాంతాల్లో గాలించారు. చిన్నారి ఆచూకీని కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలు, జాగిలాలు రంగంలోకి దిగాయి. ప్రణవి వీధుల్లో తిరుగుతున్న సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. దీని ఆధారంగా రాత్రంతా గాలించినప్పటికీ ప్రణవి ఆచూకీ లభ్యంకాలేదు. తెల్లవారుజామున జొన్న చేనులో పోలీస్ బృందాలు కూంబింగ్‌ నిర్వహించగా.. అక్కడే చిన్నారి నిద్రపోతూ కనిపించింది. ప్రణవి ఆచూకీ లభ్యంకావడంతో పోలీసు బృందాలు ఊపిరిపీల్చుకున్నాయి. వెంటనే చిన్నారిని తల్లి లక్ష్మీదేవికి అప్పగించారు. కొన్ని గంటల్లోనే చిన్నారిని పోలీసులు గుర్తించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు..

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 12:29 PM