తప్పు చేస్తారు.. తిప్పుకొంటారు!
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:00 AM
సాధారణంగా తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటారు. బాధితులకు న్యాయం చేస్తారు. రెవెన్యూ శాఖలో మాత్రం ఇది ‘రివర్స్’! ఇక్కడ అధికారులు తప్పు చేస్తారు. వారు చేసిన ‘తప్పు’ను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం రైతులది. ఇదేం వైచిత్రమో!
రెవెన్యూ అధికారుల ‘భూ మాయ’
నోటీసులు లేకుండా రికార్డుల తారుమారు
వెబ్‌ల్యాండ్‌లో రాంగ్ ఎంట్రీలు
భూమే లేకున్నా ఉన్నట్టుగా నమోదు
ప్రైవేటు భూమి ఇష్టానుసారం ధారాదత్తం
ఓ రైతు భూమి మరొకరి ఖాతాలోకి
పరిష్కరించుకునే భారం బాధితులపైనే
భూమిపై హక్కు ఉన్నా.. అధికారుల దయ ఉండాల్సిందే
రె వెన్యూ అధికారుల అడ్డగోలుతనం
తప్పు చేస్తున్న అధికారులపై చర్యలేవీ?
భయం లేకపోవడమే అసలు సమస్య
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సాధారణంగా తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటారు. బాధితులకు న్యాయం చేస్తారు. రెవెన్యూ శాఖలో మాత్రం ఇది ‘రివర్స్’! ఇక్కడ అధికారులు తప్పు చేస్తారు. వారు చేసిన ‘తప్పు’ను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మాత్రం రైతులది. ఇదేం వైచిత్రమో!
భూమి రికార్డులు.. రైతులు, హక్కుదారులవి. వాటికి కాపాలాదారు రెవెన్యూ అధికారి. కానీ రెవెన్యూ అధికారులు ఇష్టానుసారం భూ రికార్డులు మార్చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రైవేటు భూమిని ఇతరులకు ధారాదత్తం చేసేస్తున్నారు. ఓ రైతు భూమిని మరొకరి ఖాతాలో వేస్తున్నారు. అసలు భూమే లేకున్నా ఉన్నట్టుగా రికార్డులు సృష్టిస్తున్నారు. తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా అరుదు. కంచే చేను మేస్తే న్యాయం చేసేది ఎవరు? రైతులకు, హక్కుదారుల భూములకు భద్రత ఎలా ఉంటుంది? రాష్ట్రంలో సగటు రైతు నుంచి గవర్నర్ స్థాయి వ్యక్తి వరకు వేధిస్తున్న ప్రశ్నలివి. అధికారులు తప్పులు చేసి వాటిని సరిదిద్దుకొమ్మని రైతులపై భారం వేసేస్తున్నారు. దీంతో రైతులు కాళ్లరిగేలా అధికారులు, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఏం చేస్తే మార్పు వస్తుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న సంస్కరణలు రెవెన్యూలో సాధ్యమవుతాయా? రైతు, భూమి హక్కుదారుల ప్రయోజనాలే పరమావధిగా రెవెన్యూ శాఖ మారగలదా? అన్నీ సందేహాలే. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రైతులు భూ సమస్యలతో సతమతమవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మచ్చుకు కొన్ని ఉదంతాలు..
రాజు భూమికే దిక్కులేదు
2021లో రీ సర్వే జరుగుతున్న సమయం అది. సర్వే సరిహద్దుల చట్టం-1923 ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి భూముల కొలతలు వేయాలి. ఆ సమయంలో విజయనగరంలోని మహారాజుపేటలో సర్వే నంబర్ 569లో గజపతి రాజుల కుటుంబానికి చెందిన 4.60 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారి ప్రభుత్వ ఖాతాలో వేశారు. ఆ తర్వాత ఆ భూమి క్లాసిఫికేషన్ ఏడబ్ల్యూడీ(అసెస్డ్ వేస్ట్ డ్రైల్యాండ్)గా మండల స్థాయిలోనే మార్చేశారు. 2021 ఫిబ్రవరి వరకు అది ప్రైవేటు భూమి. ఆ తర్వాత ప్రభుత్వ భూమిగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ తప్పిదం జరిగింది. ఇది రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదమని ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. 2021 నుంచి ఈ వివాదం సాగుతోంది. గజపతి రాజుల భూ సమస్యకు పరిష్కారం అధికారులే చూపాలి. తప్పు చేసిన రెవెన్యూ అధికారే రికార్డును సరిదిద్దాలి. కానీ ఆ పని చేయకుండా ఆ భూమిని వైసీపీ ఆఫీసు కోసం కేటాయించారు. ఇప్పుడు దానిపై అనేక న్యాయ చిక్కులు కూడా వచ్చిపడ్డాయి. తన భూమి వెనక్కి ఇవ్వాలని అశోక్ గజపతిరాజు కోరుతున్నారు. విజయనగరం కలెక్టర్, సీసీఎల్‌ఏ, రెవెన్యూ కార్యదర్శిని ప్రభుత్వ స్థాయిలో సమావేశపరచి ఓ నిర్ణయం తీసుకుంటే ఆ భూమి ఆయనకే దక్కుతుంది. కానీ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. భూమి కోల్పోయిన అశోక్ గజపతిరాజే చట్టప్రకారం పోరాటం చేయాలని రెవెన్యూ శాఖ చెబుతోంది. అంటే.. తన భూమిని అన్యాయంగా ప్రభుత్వ భూమిగా నమోదు చేశారని, అది తన సొంత భూమేనని ఆయన ఆర్డీవో లేదా జాయింట్ కలెక్టర్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలట. అక్కడ తన వాదనలు వినిపించి ఆ భూమి తనదేనని నిరూపించుకునే పత్రాలు సమర్పించాలని చెబుతోంది. అక్కడా ఆయనకు న్యాయం దక్కకపోతే చివరగా న్యాయపోరాటం చేయాలని అంటోంది. అంతేకానీ సమస్యను పరిష్కరించే బాధ్యత మాత్రం రెవెన్యూ శాఖ తీసుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు తప్పులు చే స్తే.. హక్కుదారులు ఆఫీసులు, కోర్టుల చుట్టూ తిరగాలనే కొత్తవిధానం తీసుకొచ్చారన్నమాట.
అధికారుల అండతో..
విశాఖలోని మధురవాడలో గజం భూమి ధర లక్షల్లో ఉంటుంది. ఇద్దరు నేతల ప్రోద్భలంతో ఓ రెవెన్యూ అధికారి ఓ ప్రైవేటు వ్యక్తి పేరిట అక్కడి సర్వే నంబర్ 269లో కొత్తగా 14వ సబ్ డివిజన్ సృష్టించి 4.60 ఎకరాల భూమిని నమోదు చేశారు. 2024 ఎన్నికల సమయంలో గుట్టుగా ఈ పనిచేశారు. ఇప్పుడు ఆ భూమిని వెబ్‌ల్యాండ్‌లో 14వ సబ్‌డివిజన్‌గా నమోదు చేశారు. కాబట్టి తన భూమి ఎక్కడుందో చూపించాలని ప్రైవేటు వ్యక్తితో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఆయన కోరుతున్న భూమి విలువ రూ.130 కోట్ల పైమాటే. ఇదంతా బోగస్ అని, తప్పుడు రికార్డు సృష్టించి వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు చేశారని భీమిలి తహశీల్దార్ 2024 జూలైలోనే కలెక్టర్‌కు నివేదించారు. వెంటనే ఆ వెబ్‌ల్యాండ్ ఎంట్రీని తొలగించాలని, ఆ సర్వే నంబర్‌పై ఎలాంటి లావాదేవీలు జరగకుండా చూడాలని జిల్లా రిజిస్ట్రార్‌కు తహశీల్దార్ లేఖలు రాశారు. కానీ ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఆ తప్పును కొనసాగిస్తున్నారు. అంటే.. అధికారులకు నచ్చితే ఎలాంటి తప్పునైనా సరిదిద్దకుండా కొనసాగిస్తారనేదానికి ఇదో ఉదాహరణ.
ఓ మహిళా రైతు ఆవేదన
తిరుపతి రూరల్ మండలం కేసీపేటలో ఓ మహిళా రైతుకు సర్వే నంబర్ 366, 375, 376లో 4 ఎకరాల భూమి ఉంది. భూముల రీ సర్వే చేసే సమయంలో ఈ రైతు భూమిలో కొంత భాగాన్ని పక్కనే ఉన్న మరో రైతు ఖాతాలో వేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం 8-10 కోట్ల పైమాటే. బాధిత రైతు విమలమ్మ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఏ అధికారి కూడా స్పందించడం లేదు. నోటీసులు ఇస్తున్నారు కానీ న్యాయం చేయడం లేదు. ఇదేమని అడిగితే కోర్టుకు వెళ్లాలని రెవెన్యూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి రైతుకున్న భూమిని తగ్గించింది రెవెన్యూ అధికారులు. ఆ తప్పును సరిదిద్దాల్సింది కూడా వారే. ఆ మహి ళా రైతు తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, సర్వేయర్, ఇతర అధికారుల చుట్టూ తిరిగినా ఊరట లభించడం లేదు. భూమి విలువైనది కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పా? లేక యాదృశ్చికంగా జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పులు చేసినా ఊరట
ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డుల విషయంలో భారీగా తప్పులు జరిగిపోతున్నాయి. ప్రభుత్వం గుర్తించిన కీలకమైన కేసుల్లో చర్యలు ఉంటున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నా లేక రికార్డు తారుమారు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటుంది. అదే ప్రైవేటు భూమిని అక్రమంగా ప్రభుత్వ ఖాతాలో వేసిన కేసుల్లో చర్యలు తీసుకోవడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఇటు అధికారులపై కనీస చర్యలు ఉండటం లేదు. ఒకవేళ ఎక్కడైనా తప్పులు తేలితే రెవెన్యూ కార్యదర్శి, సీసీఎల్‌ఏ స్థాయిలో చర్యలు తీసుకున్నా.. అధికారులు రెవెన్యూ మంత్రి కోర్టులో అప్పీల్ చేసి శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో రెవెన్యూ మంత్రి కోర్టు 18 మంది అధికారులకు ఊరట ఇవ్వడం సంచలనంగా మారింది. ఇందులో సింహాచలం, అడవి వరం భూముల కేసుల్లో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న కీలక అధికారులు కూడా ఉన్నారు. తప్పులు చేసిన వారికి పైస్థాయిలో ఊరట లభిస్తే ఇక వారిలో భయం ఎక్కడ ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎవరో ఒకరు కాపాడుతారన్న ధీమానే కొందరు అధికారులు మరింత విచ్చలవిడిగా తప్పులు చేసేలా చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.