Share News

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:04 AM

భారత అంతరిక్ష ప్రయోగాల్లో నవశకానికి నాంది పలుకుతూ శ్రీహరికోట నుంచి శనివారం ప్రయోగించిన తొలి ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతమైంది.

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

  • సీఈవో పవన్‌కుమార్‌, సీవోవో నాగభరత్‌ మన వాళ్లే

  • పవన్‌ది మచిలీపట్నం, నాగభరత్‌ది ఒంగోలు సమీపం బి.నిడమనూరు

  • ఇస్రోలో ఉద్యోగాలు వదులుకుని ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ స్థాపన

ఏలూరు అర్బన్‌, మచిలీపట్నం టౌన్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష ప్రయోగాల్లో నవశకానికి నాంది పలుకుతూ శ్రీహరికోట నుంచి శనివారం ప్రయోగించిన తొలి ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతమైంది. అయితే ఈ విజయంలో ప్రధాన భూమిక నిర్వహించిన సీఈవో చందన పవన్‌ కుమార్‌, సీవోవో నాగభరత్‌ డాకా ఏపీకి చెందిన వారే కావడం విశేషం. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ఆ సంస్థ సీఈవోగా పనిచేస్తున్న మచిలీపట్నానికి చెందిన చందన పవన్‌కుమార్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. పవన్‌కుమార్‌ తండ్రి చందన శ్రీనివాస్‌ మచిలీపట్నంలో కన్సల్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. పవన్‌ మచిలీపట్నంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. ఇస్రోలో కొంతకాలం పనిచేశాక 2018లో నాగభరత్‌తో కలిసి స్కైరూట్‌ ఎరోస్పే్‌సను స్థాపించారు. ఆ సంస్థ ప్రయోగించిన విక్రమ్‌-1 విజయవంతం కావడంతో చందన పవన్‌కుమార్‌ను మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు.

నాగభరత్‌ డాకాకు ఏలూరుతో ప్రత్యేక అనుబంధం

నాగభరత్‌ డాకాకు ఏలూరుతో ప్రత్యేక అనుబంధం ఉంది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ప్రయాణంలో నాగభరత్‌ చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌ (సీవోవో)గా వ్యవహరిస్తున్నారు. ఏలూరుకు చెందిన చావలి శ్రీరామచంద్రమూర్తి, బాలత్రిపుర సుందరి దంపతుల కుమార్తె పావనిని... ఒంగోలు సమీపంలోని బి.నిడమనూరు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రఘురామిరెడ్డి, శాంతలక్ష్మి దంపతుల కుమారుడు నాగభరత్‌ 2016లో వివాహమాడారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన పావని... ప్రస్తుతం హైదరాబాద్‌ డెలాయిట్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. నాగభరత్‌, పావని దంపతులకు రామతేజస్‌ (6), సుహాస్‌ (రెండున్నరేళ్లు) కుమారులు. ఐఐటీ మద్రాసులో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన నాగభరత్‌తోపాటు ఖరగ్‌పూర్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన పవన్‌కుమార్‌ చందన (రాజమహేంద్రవరం) ‘ఇస్రో’లో శాస్త్రవేత్తలుగా పనిచేశారు. ఇస్రోకు దీటుగా ప్రైవేటు రంగంలో చరిత్ర సృష్టించాలన్న లక్ష్యంతో ఈ ఇద్దరూ ఆ ఉద్యోగాలు వదులుకుని 2018లో స్టార్ట్‌పగా స్కైరూట్‌ ఏరోస్పే్‌సను ప్రారంభించారు. ఈ సంస్థకు నాగభరత్‌ సీవోవోగా, పవన్‌కుమార్‌ సీఈవోగా ఉన్నారు. ఎనిమిదేళ్ల పాటు ఎంతో శ్రమించి.. దేశం గర్వించదగ్గ రీతిలో విక్రమ్‌-1 ప్రయోగాన్ని విజయవంతం చేశారు. అంతరిక్ష పరిశోధనల్లో స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు.


ఏపీలో స్కైరూట్‌ స్థాపనకు భూమి కేటాయింపు

ప్రస్తుతం హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరువలో కార్యకలాపాలు సాగిస్తున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌ భవిష్యత్తును సీఎం చంద్రబాబు ముందే ఊహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీహరికోటకు సమీపాన తిరుపతి జిల్లాలోని రౌతుసురమాల, బీ.ఎ్‌స.పురం, కొత్తపాలెం గ్రామాల పరిధిలో గతేడాది సెప్టెంబరు 6న 300 ఎకరాల భూములు కేటాయించారు. రూ.400 కోట్లు పెట్టుబడితో, 300 మందికి ఉపాధి కల్పించడానికి వీలుగా స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థను ఇక్కడ స్థాపించేందుకు అనుమతులిచ్చింది. త్వరలోనే భూములను స్కైరూట్‌ సంస్థకు ప్రభుత్వం రిజిస్టర్‌ చేయనుంది.

15 ప్రయోగాలు చేయడమే లక్ష్యం: పవన్‌కుమార్‌

‘2030 నాటికి 15 ప్రయోగాలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. విక్రమ్‌-1 ప్రయోగం విజయవంతం కావడంతో మా కష్టానికి గుర్తింపు వచ్చింది. 2027లో విక్రమ్‌-2 ప్రయోగంపై దృష్టి సారిస్తున్నాం. చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడతాం. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేట్‌ వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఈ అవకాశం లభించింది. నా తండ్రి శ్రీనివాస్‌ ప్రోత్సాహం ఎంతో స్ఫూర్తినిచ్చింది.’

Updated Date - Jul 20 , 2026 | 04:04 AM