నీట్, అయోధ్యపై భగ్గుమన్న ప్రతిపక్షాలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:23 AM
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం సోమవారం పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు పార్లమెంట్‌ను...
తొలిరోజు సమావేశాలు భగ్నం
ఏ కార్యక్రమాల్లేకుండానే వాయిదా
నిరసనమధ్యే లోక్‌సభకు జడ్జిల బిల్లు
షెడ్యూల్‌లో లేని డీలిమిటేషన్ బిల్లు
న్యూఢిల్లీ, జులై 20 (ఆంధ్రజ్యోతి): నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం సోమవారం పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ విద్యార్థులు పార్లమెంట్‌ను ముట్టడిస్తున్న సమయంలోనే ప్రతిపక్షాలు అదే అంశంపై ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం సృష్టించారు. లోక్‌సభ ఆరు సార్లు, రాజ్యసభ ఆరు సార్లు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలు, అయోధ్యలో హుండీల్లో చోరీపై వెంటనే చర్చించాలంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. పేపర్ లీక్‌కు కారకుడైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించాయి. ఉదయం 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. సభామధ్యంలోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు. చనిపోయిన సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెడుతున్న సమయంలో కూడా నిరసనలు ఆగలేదు. స్పీకర్ స్థానంలో వచ్చిన జగదంబికా పాల్, దిలీప్ సైకియా కూడా సభా కార్యక్రమాలను నిర్వహించలేకపోయారు. మధ్యా హ్నం 12నుంచి ప్రతీ అరగంటకోసారి సభ వాయిదా పడుతూ వచ్చింది. తమను సభలోకి రాకుండా అడ్డుకున్నారని మధ్యాహ్నం 2 గంటలకు కొందరు ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలకు మర్నాటికి వాయిదా వేశారు. మధ్యాహ్నం 12.30కి లోకసభ వాయిదా పడే సమయంలోనే న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లును ప్రవేశపెట్టారు.
రాజ్యసభలోనూ అదే పరిస్థితి
రాజ్యసభ కూడా ఉదయం 11 గంటల నుంచి ఆరు సార్లు వాయిదా పడ్డ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఉదయం కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, సంతాప తీర్మానాలు జరిగిన వెంటనే సభలో ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన నీట్ పేపర్ లీక్‌పై ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన తెలుపుతున్న వేలమంది విద్యార్థులపై లాఠీఛార్జి చేశారని వారి గొంతులు నొక్కేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా షేమ్, షేమ్ అంటూ నినాదాలు చేశారు. గందరగోళం మధ్య చైర్మన్ రాధాకృష్ణన్ సభను 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత అరగంటకోసారి సభ సమావేశం కావడం వెంటనే వాయిదా పడటం జరిగింది.
ఎజెండాలో లేని డీలిమిటేషన్ బిల్లు
సోమవారం ఉదయం స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీ, చైర్మన్ రాధాకృష్ణన్ అధ్యక్షతన రాజ్యసభ సభా వ్యవహారాల కమిటీ సమావేశమయ్యాయి. వందేమాతరం తప్పనిసరి చేయాలన్న బిల్లు, విదేశీ విరాళాలను నియంత్రించే బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అనుసంధాన్ బిల్లు, ఆదాయ పన్ను సవరణ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వందేమాతరం బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినా గందరగోళం మధ్య సాధ్యం కాలేదు. మంగళవారం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ వారం ఎజెండాలో చేర్చలేదని స్పష్టమవుతోంది. పరిస్థితులు చక్కబడ్డాక వచ్చేవారం ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి...
విక్రమ్-1 విజయంలో తెలుగు తేజాల కృషి
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.