Share News

రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి తొలగించలేరు: అశ్విన్

ABN , Publish Date - Jul 21 , 2026 | 07:59 AM

లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో రోహిత్‌పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి తొలగించలేరు: అశ్విన్
Ravichandran Ashwin

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటన తర్వాత రోహిత్‌ వన్డే ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ (138) అద్భుతమైన సెంచరీతో విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో రోహిత్, విరాట్‌లను జట్టు నుంచి తప్పించడం ఎవరికీ సాధ్యం కాదని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు.


తన యూట్యూబ్ ఛానల్ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ.. వారిద్దరినీ తొలగించడం ఎందుకు కష్టమో రెండు ముఖ్యమైన కారణాలను వివరించాడు. 'వారు వన్డేల్లో కొనసాగాలని అనుకుంటే మేనేజ్‌మెంట్ లేదా సెలెక్టర్లు వారిని ఏమీ చేయలేరు. అందుకు ప్రధాన కారణం వాళ్ల గొప్ప ట్రాక్ రికార్డే. వన్డేల్లో రోహిత్ ఇప్పటికే దాదాపు 12,000 పరుగులు చేశాడు. రెండో కారణం ఏమిటంటే.. వారిద్దరూ స్టార్ బ్యాటర్లు కావడం సహా వారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వారిని చూసేందుకే చాలా మంది మైదానాలకు వస్తారు. ఒకవేళ వారిని జట్టు నుంచి తొలగిస్తే అభిమానుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది' అని అశ్విన్ పేర్కొన్నాడు.


అదే సమయంలో బౌలర్ల పట్ల చూపే వివక్షపై కూడా అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'మహ్మద్ షమీ, సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ లాంటి దిగ్గజ బౌలర్లను పక్కనబెడితే వందల లేదా వేల మంది ప్రశ్నించవచ్చేమో కానీ, పెద్ద వివాదం జరగదు. కానీ, భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అలా గళం విప్పే రోజు వస్తే, బౌలర్లను పక్కనపెట్టడం కూడా సెలెక్టర్లకు అంతే కష్టమవుతుంది' అని అశ్విన్ విశ్లేషించాడు.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, కోచ్ కెవిన్ కీగన్ కన్నుమూత

‘ఆల్‌ ఇంగ్లండ్‌ జూనియర్‌’ చాంపియన్‌ సాయి

Updated Date - Jul 21 , 2026 | 08:16 AM