Share News

ఢిల్లీకి వస్తున్న రైతులు.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్..

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:37 AM

హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఆందోళన నెలకొంది.

ఢిల్లీకి వస్తున్న రైతులు.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్..
Delhi Farmers Protest

ఢిల్లీ: హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసనకు దిగుతున్నారు. అయితే, వారిని అడ్డుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.


ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద మహాపంచాయత్‌కు 'దేశ్ బచావో మోర్చా' పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి. అయితే, నేడు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఢిల్లీకి బయలుదేరుతున్నట్లు ప్రకటించింది. దీంతో శంభు సరిహద్దును పోలీసులు మూసివేశారు. రైతులను అడ్డుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అన్నదాతలను నిలువరించేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ నాయకుడు జర్మన్‌జిత్ సింగ్ బండాలా మాట్లాడారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం భారతీయ రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, విస్తృత ప్రజానీకంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ అమెరికన్ కంపెనీలు, రైతులకు ప్రయోజనం చేకూర్చడమే ఈ ఒప్పందం లక్ష్యమని బండాలా ఆరోపించారు. నేడు పంజాబ్ రైతులతో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల నుంచి నిరసనలో పాల్గొనేందుకు అన్నదాతలు వస్తున్నారని తెలిపారు. ఒకవేళ తాము ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటే అక్కడే శాంతియుత సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నిరసన ఆరంభం మాత్రమేనని, ఒప్పందాన్ని కేంద్రం రద్దు చేయకపోయినా, తమ డిమాండ్లను పరిష్కరించకపోయినా ఆందోళనను తీవ్రతరం చేస్తామని బండాలా హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 10 మంది మృతి..

గాజియాబాద్-న్యూఢిల్లీ మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 53 రైళ్ల సర్వీసులపై ప్రభావం..

Updated Date - Jul 21 , 2026 | 12:36 PM