Share News

ఎవరి కోసం.. గుంతకల్లు రైల్వే డివిజన్‌ మార్పు

ABN , Publish Date - Jun 02 , 2026 | 01:26 PM

రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ అమల్లోకి రావడంతో గుంతకల్లు డివిజన్‌ కుదింపునకు గురైంది.

ఎవరి కోసం.. గుంతకల్లు రైల్వే డివిజన్‌ మార్పు
Guntakal Railway Division

  • 1 నుంచి దక్షిణ కోస్తా జోన్‌లోకి..

  • మూడోసారి కుదింపు.. తగ్గనున్న ఆదాయం

  • ఉద్యోగులకూ అవస్థలే ?

  • స్థానికుల అభిప్రాయాలకు విలువేదీ

గుంతకల్లు(అనంతపురం): రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ అమల్లోకి రావడంతో గుంతకల్లు డివిజన్‌ కుదింపునకు గురైంది. గతంలో రెండు కారణాలతో గుంతకల్లు రైల్వే డివిజన్‌ను కుదించిన విషయం పాఠకులకు తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో ఉన్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ జూన్‌ 1వ తేదీ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్నంతా ఒకే జోన్‌ పరిధిలో ఉంచాలన్న లక్ష్యంతో జోనల్‌ కేంద్రానికి అతి దూరంలో ఉన్న గుంతకల్లు డివిజన్‌ను సౌత్‌ కోస్టల్‌ రైల్వేలోకి మార్పు చేశారు.


స్థానికుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఈ డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వే నుంచి దక్షిణ కోస్తా జోన్‌లోకి మార్చారు. అలాగే ఆదాయంలో దూసుకెళ్తున్న రైల్వే డివిజన్‌కు దాదాపు వంద కిలోమీటర్ల మేర కోతవేశారు. ఈ కారణంగా డివిజన్‌కు ఆదాయం తగ్గనుండగా, రైల్వే ఉద్యోగులకు జోనల్‌ కేంద్రం అందనంత దూరానికి వెళ్లిపోయింది. అలాగే సికింద్రాబాద్‌ శివారు లల్లాగూడలో ఉన్న సెంట్రల్‌ హాస్పిటల్‌ కూడా విశాఖపట్నానికి మార్చితే ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది.


డివిజన్‌కు మూడో కోత

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు సందర్భంగా ఆపరేషనల్‌ కారణాలను చూపుతూ గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని 108 కి.మీ.ల రాయచూరు-వాడి సెక్షన్‌ను కోతకోసి సికింద్రాబాద్‌ డివిజన్‌కు మార్పుచేశారు. అతిపెద్ద రైల్వే డివిజన్‌గా ఉన్న గుంతకల్లును 2003లో రెండు కారణాలతో కోత పెట్టగా, ఇప్పుడు కొత్త జోన్‌ ఏర్పాటు సందర్భంగా మరోసారి కుదింపుచేశారు. 2003 ఏప్రిల్‌ 1న కొత్తగా ఏర్పాటైన నైరుతి రైల్వే జోన్‌ కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని బళ్లారి-వాస్కోడగామా రూటులో పలు సెక్షన్‌లను తొలగించి హుబ్లీ డివిజన్‌లోకి మార్చారు. అదే సంవత్సరం గుంటూరు రైల్వే డివిజన్‌ ఏర్పాటుకాగా,


అప్పుడు కూడా గుంతకల్లు డివిజన్‌కు కోత వేశారు. గుంటూరు వరకూ లైన్‌ గుంతకల్లు డివిజన్‌లోనే ఉండేది. 144.3 కి.మీ.ల నంద్యాల-గుంటూరు సెక్షన్‌ను గుంటూరు డివిజన్‌కు మార్పుచేశారు. 2003కు ముందు 1,573 రూట్‌ కి.మీ.ల ట్రాక్‌ నిడివి కలిగిన డివిజన్‌ దాదాపు 252 కి.మీ.లు తగ్గింది. ప్రస్తుతం 1,452.75 కి.మీ.లుగా ఉన్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ను ఆపరేషనల్‌ కారణాలను చూపుతూ 108 కి.మీ.ల హుబ్లీ-రాయచూరు సెక్షన్‌ను కట్‌చేసి సికింద్రాబాద్‌ డివిజన్‌కు మార్చారు. దీంతో ప్రస్తుతం గుంతకల్లు రైల్వే డివిజన్‌ 1344.75 రూట్‌ కి.మీ.గా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో కొనసాగనుంది.


gtk1.2.jpgజోన్‌ మార్పుతో సమస్య

గుంతకల్లు రైల్వే డివిజన్‌ దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో ఉంటే జోనల్‌ కేంద్రం 348 కి.మీ.ల దూరంలో ఉండేది. కానీ కొత్త జోన్‌ కేంద్రం విశాఖలో ఉన్నందున ఆ దూరం 833 కి.మీ.లకు పెరిగింది. ఈ కారణంగా కేవలం ఏడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న జోనల్‌ కేంద్రం కాస్తా 16 గంటల ప్రయాణ దూరానికి మారింది. దీంతో ఏదైనా అవసరాల కోసం ఉద్యోగులు, అధికారులు, ప్రజా ప్రతినిఽధులు జోనల్‌ కేంద్రానికి వెళ్లి రావాలంటే మూడు రోజుల ప్రణాళిక అవసరమౌతుంది. అదే సికింద్రాబాద్‌ అయితే రాత్రి బయలుదేరి వెళ్లి ఉదయం రైల్‌ నిలయంకు చేరుకుని పని చూసుకుని అదేరోజు రాత్రికి తిరుగు ప్రయాణంలో వచ్చే అవకాశముండేది.


పైగా సికింద్రాబాద్‌కు లెక్కకు మించిన రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైతే బస్సులోనైన వెళ్లవచ్చు. కానీ విశాఖపట్నానికి వెళ్లి రావాలంటే రెండు రైళ్లు మినహా అవకాశం లేదు. కాగా రైల్వే ఉద్యోగులు ఉన్నత వైద్య చికిత్సల కోసం లల్లాగూడ సెంట్రల్‌ ఆసుపత్రికి వెళ్లి, అక్కడి నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేయించుకునేవారు. కొత్త జోన్‌ కారణంగా సెంట్రల్‌ ఆసుపత్రి విశాఖలో ఏర్పాటైతే రైల్వే ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరమైపోతుంది. ఈ కారణంగానే రైల్వే సెంట్రల్‌ ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి.


ఆదాయానికి గండి

రాయచూరు-వాడి సెక్షన్‌ కోతపడిన కారణంగా భారీ స్థాయిలో డివిజన్‌కు సరుకు రవాణా అదాయానికి గండిపడనుంది. డివిజన్‌ కోత కారణంగా త్వరలో రన్నింగ్‌ స్టాఫ్‌ రూట్‌ కి.మీ.లు కూడా తగ్గనున్నాయి. ఇవి నష్టాలుకాగా జోనల్‌ కేంద్రం విశాఖపట్నంలో ఉన్నందున గుంతకల్లు నుంచి జోనల్‌ కేంద్రానికి కనెక్టివిటీని పెంచడానికి వయా విజయవాడ రైళ్లు పెరిగే అవకాశముంది. ఇప్పటికే మైసూరు-కాకినాడ ప్రత్యేక రైలును రెగ్యులర్‌ రైలుగా మార్చడం, తిరుమల ఎక్స్‌ప్రెస్‏ను గుంతకల్లు వరకూ పొడిగించడం, గుంతకల్లు మార్కాపురం ప్యాసింజరు రైలును ప్రవేశ పెట్టారు. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు రానున్నాయి.


ఆసుపత్రిని విజయవాడలో ఏర్పాటు చేయాలి

జోనల్‌ కేంద్రం విశాఖలో ఏర్పాటైనందున గుంతకల్లు రైల్వే డివిజన్‌కు అసౌకర్యం ఏర్పడుతుంది. రైల్వే ఉద్యోగులకు సమస్య ఏర్పడకుండా రైల్వే సెంట్రల్‌ ఆసుపత్రిని విశాఖలో కాకుండా విజయవాడలో ఏర్పాటుచేస్తే రైల్వే ఉద్యోగులకు కొంత సౌకర్యంగా ఉంటుంది. గుంతకల్లు డివిజన్‌ రైల్వే ఉద్యోగులు వైద్య సదుపాయాల కోసం లల్లాగూడ ఆసుపత్రికి వెళ్లే అవకాశాన్ని కూడా కల్పించాలి.

  • సీహెచ్‌ శంకర్రావు, మజ్దూర్‌ యూనియన్‌ జోనల్‌ కార్యదర్శి


రైళ్లను పెంచాలి

జోనల్‌ కేంద్రం గుంతకల్లు జోన్‌కు దాదాపు 16 గంటల ప్రయాణ దూరంలో ఉంది. ఏదైనా అవసరమై జోనల్‌ కేంద్రం విశాఖకు వెళ్లడానికి తగినన్ని రైళ్లు లేవు. ప్రయాణ సమయం తగ్గేలా కొత్త హైస్పీడ్‌ రైళ్లను వెయ్యాలి. ఈ విషయంగా డీఆర్‌ఎంతో చర్చించాం. ఈ విషయాన్ని రైల్వే బోర్డుకు లేఖ రాశానని ఆయన తెలిపారు.

  • ప్రభాకర్‌, ఎంప్లాయీస్‌ సంఘ్‌ డివిజనల్‌ కార్యదర్శి


ఈ వార్తలు కూడా చదవండి:

ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

సినిమా స్టైల్లో చోరీ.. క్షణాల వ్యవధిలో రూ. 5.50 లక్షలు కొట్టేశాడుగా..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 01:26 PM