తిరుమల పవిత్రతను మంటగలిపారు
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:20 AM
సీపీ పాలనలో తిరుమల ప్రతిష్ఠ మంటగలిపారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు.
వైసీపీపై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజం
12న సాధువులందరితో తిరుపతిలో సమావేశం
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం), జూన్ 1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో తిరుమల ప్రతిష్ఠ మంటగలిపారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. విశాఖపట్నం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన సాధువులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు కూడా టీటీడీ పవిత్రతకు నిత్యం భంగం కలిగిస్తున్నారన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామిపై బురదజల్లే పనిని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి భుజాలపై వేసుకున్నారేమోనని సందేహం కలుగుతోందన్నారు. దేవాలయాల్లో ఏదో జరిగిందని వైసీపీ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. శ్రీవేంకటేశ్వరస్వామిని నల్లరాయితో పోల్చిన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలను, అసత్య ప్రచారాన్ని తాము ఖండిస్తే తమపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఏకంగా దొంగ స్వామీజీ, సాధువులు అంటున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. స్వామీజీలు టీడీపీ కార్యకర్తలనడం సబబు కాదన్నారు. గతంలో జగన్ దురాగతాలను రాష్ట్ర ప్రజలు, భక్తులు తెలుసుకొని ఇంటికి సాగనంపారని.. తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో వారికి ఒక్క సీటే దక్కుతుందని హెచ్చరించారు. ఈ నెల 12న సాధువులందరితో కలిసి తిరుపతిలో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.