సుస్థిర నగరాల నిర్మాణమే లక్ష్యం
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:19 AM
భవిష్యత్ తరాలకు పర్యావరణహిత, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల నిర్మాణమే లక్ష్యంగా విజయవాడ వేదికగా అంతర్జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది.
విజయవాడలో యునిడో ఎస్‌సీఐఏపీ సదస్సు ప్రారంభం
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 1 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్ తరాలకు పర్యావరణహిత, వాతావరణ మార్పులను తట్టుకునే నగరాల నిర్మాణమే లక్ష్యంగా విజయవాడ వేదికగా అంతర్జాతీయ స్థాయి సదస్సు ప్రారంభమైంది. ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాలన్‌మెంట్ ఫెసిలిటీ(జీఈఎఫ్), కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంఓహెచ్‌యుఏ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయుఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌పైలట్ (ఎస్‌సీఐఏపీ) ముగింపు సదస్సు సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రారంభమైంది. రెండ్రోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 120 మంది పట్టణాభివృద్ధి నిపుణులు, మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ‘పట్టణ సుస్థిరత-వాతావరణ చర్యల పురోగతి’ అంశంపై జరుగుతున్న ఈ సదస్సును కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సురభి మాలిక్ ప్రారంభించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె.మయూర్ అశోక్, పురపాలకశాఖ కమిషనర్ పి.సంపత్‌కుమార్, ఎన్‌ఐయూఏ డైరెక్టర్ డెబోలినా కుండు, ఎన్‌ఐయూఏ రిసోర్స్ అండ్ వేస్ట్ విభాగాఽధిపతి పరమితా దత్తా డే, ఐసీఎల్‌ఈఐ సౌత్ ఏషియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమాని కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునిడో సబ్ రీజనల్ ఆఫీస్ డైరెక్టర్ క్రిస్టియానో పసిని, యునిడో ప్రధాన కార్యాలయం వియన్నాకు చెందిన రికార్డో సావిగ్లియానో, జీఈఎఫ్ సెక్రటేరియట్ సస్టైనబుల్ సిటీస్ ప్రోగ్రామ్ లీడ్ అలోక్ బర్నవాల్ వీడియో సందేశాల ద్వారా సుస్థిర పట్టణాభివృద్ధికి సమష్టి కృషి అవసరాన్ని వివరించారు. పట్టణాల సుస్థిర అభివృద్ధికి స్థానిక సంస్థలు వినూత్న విధానాలు చేపట్టాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. సదస్సులో తొలి రోజు వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డీకార్బనైజింగ్ సిటీస్ అంశంపై జరిగిన చర్చల్లో పట్టణాల్లో కార్బన్‌ఉద్గారాల తగ్గింపు, తక్కువ కార్బన్ ఆధారిత అభివృద్ధి నమూనాలు, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై నిపుణులు విస్తృతంగా చర్చించారు.