కొత్తకూత మొదలు
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:12 AM
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కార్యకలాపాలు ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి.
దక్షిణకోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం
మౌలిక వసతులు, భద్రతకు అధిక ప్రాధాన్యం.. కొత్త జోన్ జీఎం సందీప్ మాధుర్
నలుగురు డీఆర్‌ఎంలతో సమీక్ష.. ఇచ్ఛాపురం సమీపంలో జోన్ బోర్డును
ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కార్యకలాపాలు ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. విశాఖ సిరిపురం జంక్షన్‌లోని ‘ది డెక్’ భవనంలో ఏర్పాటుచేసిన ఈ కార్యాలయంలోకి అధికారులు, సిబ్బందికి సోమవారం కొత్త జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ సాదరంగా స్వాగతం పలికారు. దీని పరిధిలోని నాలుగు డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎంలు) , ప్రధాన విభాగాధిపతులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు. భారతీయ రైల్వే చరిత్రలో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియ అరుదైన సందర్భమని, దేశంలో 18వ జోన్‌గా నిలిచిందని తెలిపారు. పాలనా సామర్థ్యం పెంపు, మరింత సమర్థంగా రైళ్ల ఆపరేషన్ నిర్వహణ, ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించడానికి దీనిని ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రాంతంలో రైల్వేపరంగా మౌలిక వసతుల అభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడాలని ఆకాంక్షించారు. ఎన్ని చేసినా రైల్వేలో భద్రతకే అధిక ప్రాధాన్యమని.. కొత్త జోన్‌లో కూడా ఇంతేననని.. ప్రతి ఆపరేషన్‌లో ఇది కొనసాగాలని న్పష్టంచేశారు. అధికారులు, సిబ్బంది బృందంగా కలిసి పనిచేయాలని.. దేశంలో ఉత్తమ జోన్‌గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపిచ్చారు. ఈ సందర్భంగా జోన్ సిస్టమ్ మ్యాప్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. నాలుగు డివిజన్ల నుంచి హాజరైన డీఆర్‌ఎంలు లలిత్ బొహ్రా (విశాఖపట్నం), మోహిత్ సొనాకియా(విజయవాడ), సుదేష్ణ సేన్ (గుంటూరు), చంద్రశేఖర్ గుప్తా (గుంతకల్).. తమ పరిధి, ఆస్తుల నిర్వహణ, మానవ వనరులు, ఎదుర్కొంటున్న సవాళ్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వారు ప్రస్తావించిన సమస్యలకు జీఎం వెంటనే పరిష్కారాలు సూచించడం సమావేశానికి హైలైట్‌గా నిలిచింది.
పల్లా ఆధ్వర్యంలో కూటమి సంబరాలు..
సోమవారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో కూటమి నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు. దువ్వాడ రైల్వేస్టేషన్ వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డప్పులు, బాణసంచా మోతల మధ్య నృత్యాలు చేశారు. మిఠాయిలు పంచి పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రైల్వే జోన్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు పల్లా కృతజ్ఞతలు తెలిపారు. గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, డీసీసీబీ చైర్మన్, జనసేన నేత కోన తాతారావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక సాకారం: రామ్మోహన్‌నాయుడు
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని పౌర విమానయాన మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో సోమవారం ఆయన కొత్త రైల్వేజోన్ బోర్డును ఆవిష్కరించి మొక్కలు నాటారు. అనంతరం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద కార్యక్రమంలో మాట్లాడారు. నూతన జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత రైల్వే సమస్యలకు స్థానికంగానే త్వరితగతిన పరిష్కారం లభిస్తుందన్నారు. రైల్వేజోన్ మంజూరు చేసిన ప్రధాని మోదీకి, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఈ ప్రాంత ప్రజల తరఫున కృత జ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం రైలులో పలాసకు బయల్దేరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తదితరులు పాల్గొన్నారు. పలాస రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సభలోనూ రామ్మోహన్ ప్రసంగించారు.
విశాఖ రైల్వే జోన్ గేమ్ చేంజర్
కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
ఇది ప్రధాని మోదీ కానుక: మాధవ్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అత్యంత కీలకమైన రైల్వే జోన్ హామీని ఎన్డీఏ ప్రభుత్వం సగర్వంగా నెరవేర్చిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా దేశంలోనే 18వ రైల్వే జోన్‌గా ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించడం ప్రతి ఒక్క ఆంధ్రుడికి గర్వకారణం అని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈ చరిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గేమ్ చేంజర్ కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో సీఎం చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ‘డబుల్ ఇంజన్’ వేగంతో అభివృద్థి పథంలో దూసుకుపోతోందన్నారు. కాగా, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దాల్చడం.. రాష్ట్ర అభివృద్థి పథంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఏపీకి రైల్వే జోన్ ప్రధాని మోదీ ఇచ్చిన చరిత్రత్మక కానుక అన్నారు. పోర్టు నగరంగా ఉన్న విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు కావడం వల్ల పోర్ట్ కనెక్టివిటీ, పారిశ్రామిక సరుకు రవాణా, ఎగుమతి-దిగుమతి కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందన్నారు.