అనంతలో 'మత్తు' కలకలం.! విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:08 PM
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్‌పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
అనంతపురం, జనవరి21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AndhraPradesh Govt) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధాలపై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న వయసులోనే విద్యార్థులు వ్యసనాల బారినపడినట్లు గుర్తించారు. మత్తులో ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయుల మాట వినకపోవడం వంటి అంశాలు జిల్లా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. విద్యార్థుల ప్రవర్తన వారిని వేధిస్తున్న 'మత్తు చాక్లెట్ల' ముఠాపై ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది.
కెరీర్ గైడర్స్ సర్వే..
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థుల మధ్య సంబంధాలపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో పలు విషయాలు అధికారుల దృష్టికి వచ్చాయి. కొందరు విద్యార్థులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, వారిని అదుపు చేయడం టీచర్లకు సాధ్యం కావడంలేదని అధికారుల సర్వేలో తేలింది. విద్యార్థుల ఈ వింత ప్రవర్తనకు గల కారణాలను అన్వేషించగా.. వారు తెలియకుండానే మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని స్పష్టమైంది.
అధికారులకు రిపోర్ట్..
ఈ డేటాను విద్యాశాఖ అధికారులు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్‌లకు పంపారు. పాఠశాలల సమీపంలోని చిన్న చిన్న దుకాణాల్లో 'మత్తు చాక్లెట్లు' విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నెల రోజుల క్రితం అనంతపురం ఓల్డ్ టౌన్(వన్ టౌన్) పీఎస్ సమీపంలో విద్యార్థుల మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణకు ఈ మత్తు చాక్లెట్లే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల ధర్మవరంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మత్తు చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి బయటి రాష్ట్రాల నుంచి జిల్లాకు సరఫరా అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ మత్తు పదార్థాల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో తొలగించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ప్రభుత్వ చర్యలు..
ఈ పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా యంత్రాంగం తక్షణమే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల సమీపంలోని కిరాణా దుకాణాలతో పాటు షాపుల్లోనూ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కేవలం విద్యార్థులకే కాకుండా, వారి తల్లిదండ్రులకూ సైకియాట్రిస్టుల(Psychiatrists) ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. కెరీర్ గైడర్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సమస్యాత్మక పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రకమైన బిజినెస్ చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
తల్లిదండ్రులకు సూచనలు..
తమ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కింది జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పులు వచ్చినా, వారు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని కోరుకున్నా వెంటనే గమనించడం.
తమ పిల్లలకు ఇచ్చే పాకెట్ మనీని వారు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో పర్యవేక్షించడం.
పిల్లలు బయటి నుంచి తెచ్చుకునే చాక్లెట్లు, ఇతర తినుబండారాల ప్యాకింగ్‌ను పరిశీలించడం.
అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ నేరుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుండటంతో.. త్వరలోనే ఈ మత్తు మాఫియా అంతమవుతుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెట్టుబడులకు అత్యంత సురక్షితమైనది.. భారత్: సీఎం చంద్రబాబు
మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన హోం మంత్రి అనిత
For More AP News And Telugu News