Kadiyam Srihari: అందుకే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా.. కడియం శ్రీహరి క్లారిటీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:44 PM
మాజీమంత్రి కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లుందని చెప్పుకొచ్చారు. కొందరు తన బొమ్మను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు.
జనగామ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కేటీఆర్ (KTR)పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు అహంభావం ఎక్కువ అని విమర్శలు చేశారు. కేటీఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ కంటే తాను వయసులో రెండేళ్లు పెద్ధవాడినని ప్రస్తావించారు. కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తే... తాను 14ఏళ్లు మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. ఘన్‌పూర్ ప్రజలను అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుందని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక సర్పంచులను గెలుచుకున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 1,25,000 ఓట్లు వచ్చాయని వివరించారు. గతంలో కంటే ఎక్కువ బలపడ్డామని అన్నారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని.. అవకాశం వచ్చినప్పుడు నిజాయితీగా పని చేస్తే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున మన సర్పంచులు సద్వినియోగం చేసుకుని గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. తాను మాట ఇచ్చిన మాట ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులకు ప్రతీ గ్రామానికి రూ.10 లక్షల నిధులు ఇస్తానని స్పష్టం చేశారు. మీరు నిజాయితీగా, నీతిగా, ఎక్కడ అవినీతి లేకుండా పని చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్‌కు గ్రామాల్లో ఉనికి లేకుండా పోయిందని విమర్శించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
తాను నియోజకవర్గంలో గెలిచినా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను బీఆర్ఎస్ తరపున గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు. అనేక సంవత్సరాలుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న ఎంతమందిపై అనర్హత వేటు పడిందని ప్రశ్నించారు. కేటీఆర్ సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1400 కోట్ల నిధులు తీసుకువచ్చానని గుర్తుచేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
ప్రతీ గ్రామానికి సాగు నీరు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నానని వివరించారు. కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లుందని చెప్పుకొచ్చారు. కొందరు తన బొమ్మను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గం తనకు దేవాలయం లాంటిదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన నిర్ణయం ఉంటుందని తేల్చిచెప్పారు. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు సరిగా పని చేయలేదని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌రెడ్డితో, కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం
అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News and National News