Share News

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:06 PM

వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy Visits Kamareddy: పంట నష్టపరిహారానికి ప్రత్యేక నిధులు.. సీఎం రేవంత్‌రెడ్డి హామీ
CM Revanth Reddy Visits Kamareddy

కామారెడ్డి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూశారని చెప్పుకొచ్చారు. కష్టం వచ్చినప్పుడు అండగా ఉండే వారే నాయకులని తెలిపారు. బాధితులకు అండగా ఉండి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదుకున్నారని ఉద్ఘాటించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.


కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచించారు. ఇవాళ(గురువారం) కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్‌‌రెడ్డి పర్యటించారు. భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. బురుగిద్ద వద్ద ఇసుక మేటలు వేసిన పొలాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ క్రమంలో తమకు జరిగిన నష్టాన్ని రైతులు వివరించారు. అలాగే, లింగంపేట్‌లో బ్రిడ్జి పరిస్థితిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. బ్రిడ్జి కమ్‌ చెక్‌డ్యామ్‌ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌రెడ్డి ప్రసంగించారు.


ప్రత్యేకంగా నిధులు..

‘వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం. ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించడానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం. పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


కార్మికులను ఆదుకుంటాం..

‘వరదలతో పేదలు, రైతులు, విద్యార్థులు నష్టపోయారు. విద్యార్థులందరికీ వెంటనే పుస్తకాలు అందజేయాలని ఆదేశించాం. వరదల్లో నష్టపోయిన బీడీ, ఇతర పరిశ్రమ కార్మికులను ఆదుకుంటాం. కొడంగల్‌ ఎలాగో.. నాకు కామారెడ్డి కూడా అలాగే. అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం జరగలేదు. సహాయక చర్యల్లో నేతలు, అధికారులు పాల్గొన్నారు. పలు శాఖలను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాం. ముంపు ప్రాంత ప్రజలను కలుసుకునేందుకే ఇక్కడకు వచ్చాం. శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 04 , 2025 | 03:32 PM