MP Arvind: హిందూ దేవుళ్లపై రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపం.. ఎంపీ అరవింద్ ఫైర్
ABN , Publish Date - Dec 07 , 2025 | 01:19 PM
హిందూ దేవుళ్లపై రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్‌రెడ్డి అన్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఢిల్లీ, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై (Telangana CM Revanth Reddy Government) బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (BJP Nizamabad MP Dharmapuri Arvind) ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఇవాళ (ఆదివారం) ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లు పూర్తి చేసుకున్నందుకు కాంగ్రెస్, రేవంత్‌రెడ్డికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. ఈ రెండు సంవత్సరాల్లో బాగా సంపాదించుకున్నారని ఆరోపణలు చేశారు. చాలా పద్ధతిగా అవినీతి జరిగిందని, మంత్రులు వాళ్ల బంధువులు, రేవంత్ బంధువులు బాగా సంపాదించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజా వంచన చేసిందని ఆక్షేపించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అరవింద్.
తెలంగాణలో 793 మంది రైతుల ఆత్మహత్య..
తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగ సమస్యతో పాటు.. ఉద్యోగుల సమస్య కూడా ఉందని తెలిపారు. హిందూ దేవుళ్లపై రేవంత్‌రెడ్డికి ఎందుకంత కోపమని నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్‌రెడ్డి అన్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డి లిల్లీపుట్‌లాగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 793 మంది రైతులు రెండు సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో అన్నదాతపై లక్షకు పైగా అప్పు ఉందని వివరించారు. రైతు రుణమాఫీ చేయలేదని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఎంపీ అరవింద్.
బేధాభిప్రాయాలు లేవు..
బీజేపీ నేతల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తాము అంతా ఒక్కటేనని.. తమ పార్టీ నేతల మధ్య సఖ్యత ఉందని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు, తనకు మంచి సన్నిహితం ఉందని వివరించారు. రామచంద్రరావు తనకు పెద్దన్న లాంటి వారని, ఆయన అధ్యక్షతన రాష్ట్రంలో పార్టీ బలపడుతోందని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
Read Latest Telangana News and National News