Harish Rao: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హరీశ్‌రావు కీలక లేఖ
ABN , Publish Date - Dec 07 , 2025 | 09:01 AM
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కి (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్పీకర్‌కు ఇవాళ(ఆదివారం) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అసెంబ్లీ ప్రతిష్ఠను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు హరీశ్‌రావు.
శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా, అది జరగడం లేదని పేర్కొన్నారు. అలాగే, సరైన కారణాలు లేకుండా సభను తరచూగా, హఠాత్తుగా వాయిదా వేయడం సభా సమయానికి సంబంధించిన రూల్ 13తో పాటు వాయిదా పద్ధతులకు సంబంధించిన రూల్ 16లకు విరుద్ధమని తెలిపారు హరీశ్‌రావు.
సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభ్యులకు ఉన్న ప్రధాన క్వశ్చన్ అవర్, జీరో అవర్ నిర్వాహణలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రూల్స్ 38 నుంచి 52, అదేవిధంగా రూల్స్ 53 నుంచి 62 వరకు ఉన్న నిబంధనలను పాటించడం లేదని ప్రస్తావించారు. సభలో మంత్రుల నుంచి నేరుగా సమాధానం వచ్చే స్టార్డ్ క్వశ్చన్స్ చర్చకు రాకుండా చేస్తున్నారని, తద్వారా రూల్ 38 కల్పించిన ప్రశ్నల సమయ హక్కును కాలరాస్తున్నారని పేర్కొన్నారు హరీశ్‌రావు.
అంతేకాకుండా, ఒక ప్రశ్నకు సంబంధించి సమగ్రంగా చర్చించేందుకు, ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకునేందుకు సభ్యులకు ఉండే సప్లిమెంటరీ క్వశ్చన్స్ అవకాశాన్ని నిరాకరించడం, కుదించడం రూల్ 50 ప్రధాన ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని అన్నారు. ప్రజా సమస్యలను తక్షణమే ప్రస్తావించే జీరో అవర్‌ను కూడా ప్రతిసారి కుదించడం సభా హక్కులను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు హరీశ్‌రావు.
అలాగే, అన్ స్టార్డ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడం.. రూల్ 39 ప్రకారం వీటికి లిఖితపూర్వక సమాధానాలు సభలో ప్రవేశపెట్టాలని సూచించారు. అలాగే, రూల్ 41 ప్రకారం నిర్ణీత గడువులోగా సభ్యులకు ఆ సమాధానాలు అందజేయాలని... కానీ ఈ నిబంధనలను పాటించకపోవడంతో సభలో జవాబుదారీతనం లోపించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత రెండేళ్లుగా అసెంబ్లీలో హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం (రూల్ 196, 198) కమిటీలను కచ్చితంగా నియమించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినా, కమిటీల పని మాత్రం ఆగకూడదని రూల్ 227 స్పష్టంగా చెబుతోందని, కానీ అసలు కమిటీలే లేకపోవడం వల్ల ప్రభుత్వ పనితీరుపై పర్యవేక్షణే లేకుండా పోయిందని తెలిపారు.
అలాగే, ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ, ఆ కమిటీని తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. కమిటీల పని ఎప్పుడూ ఆగకూడదని, సమావేశాలకు సరిపడా సభ్యులు ఉండాలని రూల్స్ 199, 201 చెబుతున్నా.. వీటిని పట్టించుకోకపోవడం వల్ల కమిటీల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డిప్యూటీ స్పీకర్ నియామకం జరగకపోవడం మరో ప్రధాన ఉల్లంఘన అని ప్రస్తావించారు. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందని సూచించారు. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్‌గా వ్యవహరిస్తారని, ఆ పదవి ఖాళీగా ఉండటంతో కమిటీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పుకొచ్చారు. ఫలితంగా, సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అనేక ఫిర్యాదులు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని, ఇది రూల్ 256, 257లకు విరుద్ధమని స్పష్టం చేశారు హరీశ్‌రావు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు-1986, ముఖ్యంగా రూల్స్ 3 నుంచి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు.
గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, తక్షణమే అసెంబ్లీ నిర్వాహణలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలను సూచించారు హరీశ్‌రావు.
1.ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి.
2.ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వాహణను సరిదిద్దాలి.
3.అన్ - స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి.
4.అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి.
5.డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలి.
6.ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలి.
7.సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలి.
8.పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టంతో పాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్
Read Latest Telangana News and National News