Share News

Raj Gopal Reddy: ఓపికతో ఎదురు చూస్తున్నా, మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమెందుకు.. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:45 PM

మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

Raj Gopal Reddy: ఓపికతో ఎదురు చూస్తున్నా, మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమెందుకు.. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం
Komitireddy Raj Gopal Reddy

నల్గొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komitireddy Raj Gopal Reddy) వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం జరిగితే ఫర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని.. గత ప్రభుత్వానికి చెప్పానని.. ఈ ప్రభుత్వానికీ చెబుతున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిందని, మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఇవ్వండి, కానీ.. అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని కోరారు. తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, అయితే సమీకరణాలు కుదరటం లేదని ఇప్పుడెందుకు అంటున్నారని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం ఎందుకు కుదరటం లేదు.. ఆ సమీకరణలు రాకుండా ఎవరడ్డుకుంటున్నారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.


ఇవాళ(మంగళవారం) మునుగోడు మండలం ఎలగలగూడెంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే సమయంలో మంత్రి పదవి ఇస్తాననే తీసుకున్నారని గుర్తుచేశారు. అప్పుడు తాము ఇద్దరం అన్నదమ్ములం కాంగ్రెస్‌లోనే ఉన్నామని తెలియదా? అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తానని రెండోసారి హామీ ఇచ్చారని.. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో తాము ఇద్దరం అన్నదమ్ములం ఉన్నామని గుర్తులేదా? అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి.


ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా కొంతమంది నేతల పరిస్థితి ఉందని విమర్శించారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా? అని ప్రశ్నించారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటం తప్పా అని నిలదీశారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమేనని, ఇద్దరం గట్టి వాళ్లమేనని.. ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి పదవి ఇవ్వడానికి ఆలస్యమైనా సరే తాను ఓపిక పడుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షం.. నిండుకుండల్లా ప్రాజెక్టులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 01:51 PM