BJP VS Congress: పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంది.. రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
ABN , Publish Date - Aug 12 , 2025 | 09:52 AM
రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని బండి సంజయ్ నిలదీశారు.
హైదరాబాద్, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును (Ramachandra Rao) రేవంత్ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ (గృహ నిర్బంధం) చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Union Minister Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడివద్ద హిందూ సంఘాలు నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా రామచంద్రరావును అడ్డుకోవడంపైనా ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాల్లో బీజీగా ఉన్న బండి సంజయ్ ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఇవాళ(మంగళవారం) ఓ ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్ కుమార్.
పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది..
‘‘పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది..? తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి..? భాగ్యనగర్‌లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహారిస్తున్నట్లు కనిపిస్తోంది. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోంది. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి’ అని బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపు..
కాగా, ఇటీవల బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర అక్రమ కూల్చివేతలపై పలువురు నేతలు ఆందోళన చేపట్టారు. కూల్చివేతలకు నిరసనగా పెద్దమ్మగుడి దగ్గర ఇవాళ(మంగళవారం) కుంకుమార్చనకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లను హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షం.. నిండుకుండల్లా ప్రాజెక్టులు
Read Latest Telangana News And Telugu News