Share News

Supreme Court Orders Apology: హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పండి

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:32 AM

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై దాఖలు చేసిన ఓ కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అవమానకర వ్యాఖ్యలు,...

Supreme Court Orders Apology: హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పండి

  • జడ్జిలను న్యాయవాదులు విమర్శించే ధోరణికీ అడ్డుకట్ట వేయాల్సిందే

  • నేతలు నిందితులైతే న్యాయం జరగదన్న భావన పెరిగింది

  • నేతల కేసుల్ని ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీకి అనుమతించొద్దు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై దాఖలు చేసిన ఓ కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన పిటిషనర్‌, ఆయన తరఫు న్యాయవాదులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టుకు మాత్రమే కాకుండా వారు ఆరోపణలు చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మౌసుమి భట్టాచార్యకు కూడా వారంలోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్దేశించింది. దానిని ఆమోదించాలా లేదా అనేది పూర్తిగా ఆమె విచక్షణకే వదిలేస్తున్నామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ అతుల్‌ చందూర్కర్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరుడు 2016లో గచ్చిబౌలిలోని తన హౌసింగ్‌ సొసైటీలోకి ప్రవేశించి నిర్మాణాలను ధ్వంసం చేశారంటూ పెద్ది రాజు అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. ఈ కేసు చాలా కాలం రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్‌ జడ్జి ముందు పెండింగ్‌లో ఉంది. అయితే, ఇది రాజకీయ ప్రేరేపితమని, దీనిని కొట్టి వేయాలంటూ రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగినప్పుడు రేవంత్‌ రెడ్డి ఘటనా స్థలంలో ఉన్నారని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని పేర్కొంటూ గత జూలై 17న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మౌసుమి భట్టాచార్య కేసును కొట్టివేశారు. అయితే, అంతకంటే ముందే పిటిషనర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దృష్ట్యా హైకోర్టులో తన కేసుపై నిష్పాక్షిక విచారణ జరగదని, కేసును నాగపూర్‌ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణ సందర్భంగా.. జస్టిస్‌ మౌసుమి భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు నిష్పాక్షికంగా లేవని, వివక్షతో వ్యవహరించారని పిటిషన్‌లో పెద్దిరాజు ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి తరఫు న్యాయవాదికి, ప్రభుత్వం తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు సుదీర్ఘంగా వాదనలు వినిపించేందుకు అనుమతించారని, తమ తరఫున న్యాయవాది వాదనలు వినిపించేటప్పుడు కేవలం పది నిమిషాల్లోనే ముగించాలంటూ న్యాయమూర్తి అడ్డుకున్నారని ఆరోపించారు. తమ వాదనను వినిపించేందుకు తమకు కేవలం ఐదు నిమిషాలే సమయం ఇచ్చారని, వాస్తవాలను వివరించేందుకు సరైన అవకాశాలు ఇవ్వలేదని విమర్శించారు. న్యాయమూర్తి వైఖరి సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని, ఆమె పూర్తిగా వివక్ష ప్రదర్శించారని ఆరోపించారు. రాష్ట్ర యంత్రాంగంపై ముఖ్యమంత్రికి పూర్తి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న రీత్యా హైకోర్టులో తనకు న్యాయం జరగదనే అభిప్రాయానికి వచ్చానని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ సోమవారం చీఫ్‌ జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది.


పిటిషన్‌పై మండిపడిన ధర్మాసనం.. హైకోర్టు న్యాయమూర్తిపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. దీంతో, పిటిషనర్‌ పెద్ది రాజు, పిటిషనర్‌ తరఫు న్యాయవాది రితేశ్‌ పాటిల్‌, పిటిషన్‌ను డ్రాఫ్ట్‌ చేసిన న్యాయవాది నితిన్‌, సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ హెగ్డే క్షమాపణలు చెప్పారు. వారంలోగా హైకోర్టు న్యాయమూర్తికి కూడా క్షమాపణలు చెప్పాలని నిర్దేశించింది. అందుకనుగుణంగా, కేసును మళ్లీ అదే న్యాయమూర్తి విచారణ జరిపేందుకు వీలు కల్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోరింది. ‘‘హైకోర్టు, ట్రయల్‌ కోర్టు జడ్జిలను న్యాయవాదులు విమర్శించడం ఇటీవలి కాలంలో ఓ ట్రెండ్‌గా మారింది. రాజకీయ నాయకుల జోక్యం ఉన్న కేసును హైకోర్టులు విచారిస్తే అక్కడ తమకు న్యాయం జరగదనే భావన కూడా పెరిగిపోయింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల తరహాలోనే హైకోర్టు జడ్జిలకు కూడా రాజ్యాంగపరంగా రక్షణ ఉంది. పాలనపరంగా హైకోర్టు లేదా హైకోర్టు జడ్జిలపై సుప్రీం కోర్టుకు ఎటువంటి నియంత్రణ లేదు. హైకోర్టు న్యాయమూర్తులపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు.. వారిని కాపాడాల్సిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానానికి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించిది. నిజానికి, ఈ కేసులో గత నెల 29నే సుప్రీం కోర్టు పెద్ది రాజు, ఆయన ఏవోఆర్‌ రితేశ్‌ పాటిల్‌, ఇతర న్యాయవాదులకు ధిక్కార నోటీసులు జారీ చేసింది. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని వారు అభ్యర్థించినా తిరస్కరించింది. న్యాయమూర్తులను బోన్‌లో నిలబెట్టేందుకు పిటిషనర్లు వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేసేందుకు ఏమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. న్యాయవాదులు హైకోర్టు, కింది కోర్టు న్యాయమూర్తులను విమర్శించే ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే రాజకీయ నేతలపై ఏ న్యాయమూర్తి తీర్పు ఇవ్వలేరని సుప్రీం అభిప్రాయపడింది. రాజకీయ నాయకుల కేసుల విషయంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కేసు బదిలీ కోరడాన్ని అనుమతించకూడదని అభిప్రాయపడింది.

Updated Date - Aug 12 , 2025 | 06:32 AM