Share News

Harish Rao:రేవంత్‌రెడ్డికి కమీషన్లు కొట్టుడు.. చిల్లర మాటలే తెలుసు.. హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 12:29 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏసుప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.

Harish Rao:రేవంత్‌రెడ్డికి కమీషన్లు కొట్టుడు.. చిల్లర మాటలే తెలుసు.. హరీశ్‌రావు వ్యంగ్యాస్త్రాలు
Harish Rao

సిద్దిపేట, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): క్రైస్తవుల సంక్షేమానికి గత కేసీఆర్ సర్కార్ ఎంతగానో కృషి చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో క్రిస్మస్ సందర్భంగా రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చామని ప్రస్తావించారు. కూసీఆర్ అన్ని మతాలను గౌరవించారని పేర్కొన్నారు. క్రిస్మస్ కిట్టు, బతుకమ్మ చీరలు, రంజన్ తోపాను తమ ప్రభుత్వంలో అందించామని తెలిపారు. కానీ తమ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాత్రం క్రిస్మస్ కిట్టు ఎందుకు అందించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.


క్రిస్మస్ శుభాకాంక్షలు

క్రిస్మస్ పర్వదినం సందర్బంగా ఇవాళ(గురువారం) సిద్దిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చ్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు హరీశ్‌రావు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ పాల్గొంటున్నానని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఏసుప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు హరీశ్‌రావు.


విద్యార్థులతో కలిసి భోజనం చేసిన హరీశ్‌రావు

అలాగే.. పట్టణంలోని నాసార్‌పుర అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. విద్యార్థులకు పెట్టే గుడ్లు, బియ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు హరీశ్‌రావు. గత ప్రభుత్వంలో పాత బియ్యం ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు కొత్త బియ్యం ఇస్తున్నారని.. అన్నం మెత్తగా ముద్దలుగా అవుతుందని చెప్పుకొచ్చారు. పిల్లలు చలితో చాలా ఇబ్బందులు పడుతున్నారని.. దుప్పట్లు పంపిణీ చేశామని అన్నారు. ఐదు నెలల నుంచి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు రావడం లేదని తెలిపారు. మెస్ బిల్లులు ఐదు నెలల నుంచి ఎందుకు రావడం లేదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రీన్ చానెల్ ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పారని.. ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. 20శాతం కమీషన్ ఇచ్చే వాళ్లకు డబ్బులు విడుదల చేస్తున్నారని, కమీషన్ ఇవ్వని వాటికి డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు హరీశ్‌రావు.


పెండింగ్ బిల్లులు ఇవ్వాలి..

రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాని పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి దగ్గరే విద్యాశాఖ ఉండి కూడా అనాథ పిల్లలకు అన్నం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి మళ్లీ గెలుస్తానని శపథాలు చేస్తున్నారని విమర్శించారు. కమీషన్లు కొట్టుడు చిల్లర మాటలు మాట్లాడటం.. పార్టీలు మారడం, సీట్లు కొనడం మాత్రమే రేవంత్‌రెడ్డికి అలవాటని సెటైర్లు గుప్పించారు. తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ అని ప్రశంసించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని చెప్పుకొచ్చారు. తండ్రి లాంటి కేసీఆర్‌ గురించి అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఫార్మసిటీనీ తాము ఏర్పాటు చేస్తే దానిని ఆయన ఖండించారని, ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శలు చేశారు. వీధి రౌడీలాగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

క్రిస్మస్ సందడి.. భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

బీజేపీ మరో కీలక నిర్ణయం.. నీటి ప్రాజెక్టులపై అధ్యయనానికి సిద్ధం

For More TG News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 01:45 PM