Share News

Christmas Celebrations: క్రిస్మస్ సందడి.. భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు

ABN , Publish Date - Dec 25 , 2025 | 07:08 AM

క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి.

Christmas Celebrations: క్రిస్మస్ సందడి.. భక్తిశ్రద్ధలతో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
Christmas Celebrations

మెదక్ జిల్లా, డిసెంబరు25 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ వేడుకలను (Christmas Celebrations) తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలు చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో మొదలయ్యాయి. ఏసు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చి పరిసర ప్రాంతమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది.


క్రిస్మస్ వేడుకల ప్రారంభ సూచకంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి చుట్టూ శిలువ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. శిలువను ముందు ఉంచి క్రైస్తవులు ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని చర్చి ప్రాంగణాలు ఆధ్యాత్మిక సందేశాలతో మార్మోగాయి. ‘శాంతి, ప్రేమ, సోదరభావం’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమం సాగింది.


భారీగా పాల్గొన్న క్రైస్తవులు

క్రిస్మస్ వేడుకల ప్రారంభ ఆరాధనకు తెలుగు రాష్ట్రాల్లోని పలు చర్చిలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ఇవాళ ఉదయం నిర్వహించిన మొదటి ఆరాధనకు చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోవడంతో బయట ప్రాంగణంలో కూడా భక్తులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందుకు అనుగుణంగా చర్చిల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. చర్చి ప్రధాన ద్వారాలను విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చర్చిల ప్రాంగణాలు విద్యుత్ దీపాలతో మెరిసిపోతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి.


ప్రత్యేక ప్రార్థనలు..

మెదక్‌‌లోని ప్రసిద్ధ సీఎస్ఐ చర్చిలో ఇవాళ(గురువారం) క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. చర్చి చుట్టూ శిలువ ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలతో వేడుకలు ఆరంభించారు. మొదటి ఆరాధనకు భక్తులు భారీగా పాల్గొన్నారు. దైవ సందేశాన్ని ఇన్‌చార్జి బిషప్ రెవరెండ్ రూబిన్ మార్క్ వినిపించారు. ఆయన ప్రసంగంలో ఏసు క్రీస్తు జన్మ వెనుక ఉన్న అసలు సందేశాన్ని వివరించారు. ప్రేమ, క్షమ, త్యాగం, మానవత్వం వంటి విలువలు ఈ ప్రపంచానికి ఎంత అవసరమో ఆయన తన ఉపన్యాసంలో స్పష్టంగా చెప్పారు. సమాజంలో పెరుగుతున్న ద్వేషం, అసహనం మధ్య క్రిస్మస్ పండుగ మనకు శాంతి మార్గాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు.


వివిధ రంగు రంగుల విద్యుత్ కాంతులతో చర్చి ప్రాంగణం శోభాయమానంగా ఉంది. క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలతో సందడిగా మారాయి . ఈ వేడుకలు జిల్లాలో శాంతి, సంతోష వాతావరణాన్ని తీసుకువస్తాయని క్రైస్తవులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చర్చి లోపల కూడా ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. ఏసు క్రీస్తు జన్మ ఘట్టాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పండుగ వాతావరణంలో పిల్లల సందడి చర్చికి మరింత శోభను తీసుకువచ్చింది. పేదలకు ఆహార పంపిణీ, అవసరమైన వారికి సహాయం వంటి సేవా కార్యక్రమాలను కూడా చర్చి ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. మెదక్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా, సమీప గ్రామాలు, పట్టణాల నుంచి కూడా క్రైస్తవులు భారీగా చర్చికి తరలివచ్చారు.


రెండో ఆరాధనకు ఏర్పాట్లు

ఇవాళ ఉదయం 10 గంటలకు రెండో ఆరాధన నిర్వహించేందుకు చర్చి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొదటి ఆరాధన ముగిసిన వెంటనే చర్చి ప్రాంగణాన్ని శుభ్రపరిచి, రెండో ఆరాధనకు సిద్ధం చేశారు. రెండో ఆరాధనకు మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో, భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. చర్చి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వచ్ఛంద సేవకులు సహాయం అందించారు.


హైదరాబాద్‌లో..

హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. సిటీలోని పలు చారిత్రాత్మక చర్చ్‌లలో క్రిస్టియన్స్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. క్రైస్తవుల రాకతో మియపూర్ కల్వరి టెంపుల్ కిటకిటలాడుతోంది. కల్వరి టెంపుల్‌లో ఈ ఒక్కరోజే 5 లక్షల మందికి పైగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. సికింద్రాబాద్, అబిడ్స్‌లోని చారిత్రాత్మక చర్చ్‌లలో తెల్లవారుజాము నుంచే క్రిస్మస్ సందడి నెలకొంది.


మంచిర్యాల జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, రామకృష్ణపూర్ సీఎస్ఐ, సీయోను, పెంతేకొస్తు చర్చ్‌లలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవులందరికీ క్రిస్టమస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

ఆ ఛార్జీలు రద్దు చేయాలి.. టీజీఈఆర్సీకి నీటిపారుదల శాఖ లేఖ

For More TG News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 09:01 AM