Major Fire Accident: తెలంగాణలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:15 PM
ఉప్పల్‌లోని లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్‌షాప్‌లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈఘటన ఒక్కసారిగా నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌లో ఇవాళ (మంగళవారం) భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) సంభవించింది. లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్‌షాప్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో ఏర్పడిన స్పార్క్ ఫోమ్‌ను తాకడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.
వర్క్‌షాప్‌లో ఫర్నిచర్ తయారీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెలువడిన స్పార్క్ ఫోమ్ కలపను తాకడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నిచర్ వర్క్‌షాప్‌లో అధికంగా ఉండే ఫోమ్, ప్లైవుడ్, కెమికల్ కోటింగ్ పదార్థాలతో మంటలు మరింత వేగంగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాద తీవ్రతతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసించే ప్రజలు ప్రాణ భయంతో భయటకు పరుగులు తీశారు. పొగ ఎక్కువగా వ్యాపించడంతో శ్వాస తీసుకోవడంలో స్థానికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
కొందరు పిల్లలు, వృద్ధులు భయంతో అరుస్తూ బయటకు రావడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా నియంత్రించారు. కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో లిమ్రా ఫర్నిచర్ అండ్ సోఫా వర్క్‌షాప్‌కు భారీగా నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, నష్టం విలువ ఎంత అన్నది అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.
కొద్ది రోజుల్లోనే షాప్ ఓపెనింగ్ చేయాలనుకున్నామని.. అంతలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. వెల్డింగ్ పనులు చేస్తున్న కార్మికులు కూడా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫైర్ డిపార్ట్‌మెంట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో హైదరాబాద్ నగరంలోని ఫర్నిచర్ వర్క్‌షాపులు, చిన్న పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకంగా ఫోమ్, కెమికల్స్, వెల్డింగ్ వర్క్ ఉన్న చోట్ల అగ్ని ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ఈ వర్క్‌షాప్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మైగ్రేన్ తగ్గించే దివ్యౌషధం.. సింపుల్ చిట్కా.. చిన్న ముక్క ఇదిగో..
అసెంబ్లీ ఎన్నికలు.. సత్తా చాటిన బీజేపీ
For More TG News And Telugu News