Balapur Hundi Collection 2025: బాలాపూర్ గణేషుడికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం..!
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:19 PM
బాలాపూర్ గణేషుడి లడ్డూ ఈ ఏడాది మునుపెన్నడూ లేని రీతిలో వేలంపాటలో రికార్డు ధర కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కానీ, ఇదొక్కటే కాదు.. బాలాపూర్ గణపయ్యకు రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించారు భక్తులు. కేవలం 11 రోజుల్లోనే ఎన్ని లక్షల ఆదాయం వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాల సందడి అంగరంగ వైభవంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు గణపయ్యను భక్తిశ్రద్ధలతో పూజించి ఘనంగా నిమజ్జన మహోత్సవాలు నిర్వహించారు. ఎప్పట్లాగే ఈసారీ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ బడా గణేశుడితోపాటు బాలాపూర్ గణేష్ ఉత్సవాలు కూడా భక్తులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక, ఈ సంవత్సరం బాలాపూర్ వినాయకుడి లడ్డూ.. వేలంపాటలో రికార్డు ధర కొల్లగొట్టింది. అంతేకాదు బాలాపూర్ గణనాథుని హుండీ ఆదాయమూ భారీగా పెరగడం విశేషం.
వినాయక చవితి అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ లడ్డూ వేలం పాట కచ్చితంగా గుర్తుకువస్తాయి. భక్తుల అంచనాలకు తగినట్లే ప్రతి ఏడూ సరికొత్త శోభలతో అంగరంగ వైభవంగా వినాయక నవరాత్రులు జరుగుతాయి. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాటకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. మొత్తం 38 మంది వేలంలో పాల్గొన్నారు. వేలం పాట ప్రారంభ ధర రూ.1,116గా ఉండగా చివరికి రూ.35 లక్షల వద్ద ముగిసింది. ఈసారి లడ్డూని కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ దక్కించుకున్నారు. గతేడాది కంటే బాలాపూర్ లడ్డూ దాదాపు రూ.5 లక్షలు అధికంగా పలకడం గమనార్హం. ఇక లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం దశరథ్ గౌడ్ బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీకి తన వేలంపాట డబ్బును అందజేశారు.
ఇదే సమయంలో బాలాపూర్ గణపయ్యకు కానుకల రూపంలో హుండీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా మునుపటితో పోలిస్తే విపరీతంగా పెరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం బాలాపూర్ గణేశుడి హుండీకి మొత్తం రూ.23,13,760 ఆదాయం వచ్చింది. గతేడాది ఈ మొత్తం రూ.18 లక్షలుగా ఉండగా.. ఈసారి దాదాపు రూ.5 లక్షలు పెరిగింది. భక్తులు హుండీలో భారీగా విరాళాలు సమర్పించడంతో ఉత్సవ కమిటీ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ ఆదాయం గణేష్ సేవల కోసమే వినియోగిస్తామని వారు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలనం
For More Telangana News and Telugu News..