Share News

ISRO-Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్

ABN , Publish Date - Sep 09 , 2025 | 06:08 PM

ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 మందికి పైగా శాస్త్రవేత్తలు రేయింబవళ్లు పనిచేశారని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. ఈ సమయంలో అన్ని ఎర్త్‌ అబ్జర్వేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు అద్భుతంగా పనిచేశాయని అన్నారు.

ISRO-Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌ సందర్భంగా 400 మందికి పైగా సైంటిస్టులు రేయింబవళ్లు శ్రమించారు: ఇస్రో చీఫ్
Operation Sindoor Scientists Effort

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా 400 పైచిలుకు మంది శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించారని ఇస్రో చీఫ్ వి. నారాయణన్ మంగళవారం తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు కావాల్సిన శాటిలైట్ సమాచారాన్ని అందించారని అన్నారు. ఇస్రోకు చెందిన వివిధ శాటిలైట్‌ల ద్వారా సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రత కోసం అందజేశామని తెలిపారు. ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 52వ జాతీయ మేనేజ్‌మెంట్ సమావేశాల సందర్భంగా ఇస్రో చీఫ్ ఈ వివరాలను పంచుకున్నారు. ఆ సమయంలో అన్ని ఉపగ్రహాలు చక్కగా పనిచేశాయని తెలిపారు (ISRO Chairman V. Narayanan).

ఇక ఇస్రో తలపెట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సంబంధించిన ఏర్పాట్లు కూడా అద్భుతంగా సాగుతున్నాయని ఇస్రో చీఫ్ తెలిపారు. 2027 కల్లా ఈ యాత్ర చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా ఇప్పటివరకూ 7,700 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని ఆయన చెప్పారు. మరో 2,300 పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ మిషన్‌లో భాగంగా ఇస్రో తొలుత మూడు మానవరహిత అంతరిక్ష యాత్రలను ప్లాన్ చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో తొలి మానవరహిత యాత్ర నిర్వహించే అవకాశం ఉంది (Over 400 Scientists in Operation Sindoor).


ఆధునిక యుద్ధ తంత్రంలో అంతరిక్ష రంగ ప్రాముఖ్యత కూడా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా స్పష్టమైన విషయం తెలిసిందే. డ్రోన్‌లు, లాయిటరింగ్ అమ్యునిషన్‌ను ఈ ఆపరేషన్‌లో ఎక్కువగా వినియోగించారు. భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్ (Akaash Teer) తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

2035 కల్లా భారత్ తన సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఇస్రోకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2040 కల్లా చంద్రుడిపైకి భారత వ్యోమగామిని పంపాలనేది ఇస్రో ముందున్న మరో లక్ష్యం.


ఇవి కూడా చదవండి

కనీసం నాకు విషమైనా ఇప్పించండి.. కోర్టులో కన్నడ నటుడు దర్శన్ కామెంట్

మహిళా అధికారులంటే నాకెంతో గౌరవం: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్

For More National News and Telugu News

Updated Date - Sep 09 , 2025 | 06:15 PM