Ajith Pawar: మహిళా అధికారులంటే నాకెంతో గౌరవం: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:41 PM
మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌తో వాగ్వాదం వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పందించారు. తనకు పోలీసు అధికారులంటే ఎంతో గౌరవమని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణతో వాగ్వాదంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. పోలీసు అధికారులంటే తనకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
సోలాపూర్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో అక్కడకు వెళ్లిన ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ ఉప ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో మంత్రి అజిత్ పవార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ‘నీకు ఎంత ధైర్యం? ఉప ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే నమ్మవా?’ అని పవార్ ప్రశ్నించినట్టు వీడియోలో కనిపించడం వివాదానికి దారి తీసింది.
ఈ ఉదంతంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘సోలాపూర్‌లో పోలీసు అధికారులతో నా సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవడం నా దృష్టికి వచ్చింది. చట్టాల అమలులో జోక్యం చేసుకోవడం నా ఉద్దేశం ఎంతమాత్రం కాదని ఇక్కడ మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు చల్లార్చడమే నా ఉద్దేశం. నాకు పోలీసు శాఖ, మహిళా అధికారులు అంటే ఎంతో గౌరవం. వారంతా ధైర్యసాహసాలతో సేవ చేస్తున్నారు. అన్నింటికంటే నేను చట్టానికే ఎక్కువ విలువనిస్తాను. పారదర్శక పాలనకు కట్టుబడి ఉన్నాను. ఇసుక అక్రమ తవ్వకాలు సహా అన్ని తప్పుడు కార్యకలాపాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నాను’ అని పోస్టు పెట్టారు.
ఇవి కూడా చదవండి
భారత్‌ను ముక్కలు చేయాలంటూ పోస్టు.. ఆస్ట్రియా ఆర్థికవేత్త ఎక్స్ అకౌంట్‌పై నిషేధం
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెయిల్స్‌తో హైఅలర్ట్
For More National News and Telugu News