Mumbai Terror Threat: 34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెసేజ్‌తో హైఅలర్ట్
ABN , Publish Date - Sep 05 , 2025 | 03:11 PM
ముంబై నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. అనుమానాస్పద వాహనాలను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ముంబై: ముంబైకి బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నెంబర్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్ (RDX_తో మానవబాంబులు (Human Bombs) నగరంలోకి ప్రవేశించాయని, నగరం మొత్తాన్ని పేలుళ్లతో కుదిపేయనున్నామని పేర్కొంటూ బెదిరింపు సందేశాలు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. 'లష్కర్ ఏ జిహాదీ' (Lashkar-e-Jihad) అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు వచ్చిందని, 14 మంది పాక్ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్‌లోకి చొరబడినట్టు కూడా అందులో పేర్కొన్నారని వివరించారు.
కాగా, బెదిరింపు సమాచారంతో ముంబై పోలీసులు హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. అనుమానాస్పద వాహనాలను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తప్పుడు బెదిరింపు కాల్
మరో ఘటనలో, మహారాష్ట్రలోని థానే జిల్లాలో బాంబు బెదిరింపు చేసిన 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేసారు. నిందితుడిని రూపేల్ మధుకర్‌గా గుర్తించినట్టు గవర్న్‌మెంట్ రైల్వే పోలీసులు (GRP) తెలిపారు. కల్వ రైల్వే స్టేషన్‌లో బాంబు పెట్టినట్టు ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు ఇతని నుంచి పోలీస్ హెల్ప్‌లైన్‌కు సమాచారం వచ్చింది. అయితే ఈ బెదిరింపు ఉత్తదే అని తేలింది.
ఇస్కాన్ ఆలయానికి కూడా..
గత నెలలో గిర్‌గావ్‌లోని ఇస్కాన్ ఆలయానికి కూడా ఇలాంటి బాంబు బెదిరింపే వచ్చింది. ఆలయం ఆవరణలో బాంబులు పెట్టినట్టు టెంపుల్ అఫీస్ ఈమెయిల్ ఐడీకి మెసేజ్ వచ్చింది. ఆలయ నిర్వాహకులు పోలీసులను అప్రమత్తం చేయడంతో బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్వ్కాడ్ (BDDS) అర్ధరాత్రి సోదాలు జరిపింది. అయితే పేలుడు పదార్ధాలు ఏవీ ఆవరణలో కనబడకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపుగా తేలింది. గత మేలో కూడా మహారాష్ట్ర సెక్రటేరియట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. 48 గంటల్లో పేలుతుందంటూ హెచ్చరికలు రావడంతో గాలింపు చర్యలు చేపట్టగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఇటీవల కాలంలో నకిలీ బెదిరింపు కాల్స్ ఎక్కువవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. స్కూళ్లు, విమానాశ్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్టు మెయిల్స్ వస్తున్నాయి. అయితే ఈ బెదిరింపులు ఉత్తవే అని తేలుతున్నాయి. గత మేలో ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌కు సైతం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
ఇవి కూడా చదవండి..
భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ..
మాజీసీఎం సంచలన కామెంట్స్.. రాసిపెట్టుకోండి.. స్టాలిన్ కల ఫలించదు
For More National News And Telugu News