Kiran Kumar Reddy: తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బీఆర్‌ఎస్ మద్దతు అవసరం
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:06 PM
తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసినట్లే తెలంగాణ వ్యక్తులకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వదిలేశారా అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
ఢిల్లీ, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ బిడ్డ అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) ఇండియా కూటమి తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్ (BRS) మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) సూచించారు. కేసీఆర్ తన పార్టీ పేరు నుంచి తెలంగాణను తీసేసినట్లే తెలంగాణ వ్యక్తులకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వదిలేశారా? అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ని కేంద్రమంత్రిగా, హరీష్‌రావుని ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ తెలంగాణలో మంత్రిని చేసిందని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని ఉద్ఘాటించారు. అలాంటి పార్టీని ఇప్పుడు మీరు చీదరించుకోవడం చూస్తుంటే మాజీ మంత్రి కేటీఆర్ నిలకడలేని తనం బయటపడుతోందని విమర్శించారు. ఢిల్లీ వేదికగా ఇవాళ(గురువారం) ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఖరీఫ్ సీజన్‌కి యూరియా ఎందుకివ్వలేదు...
ఎంత యూరియా కావాలో తెలియకుండానే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రైతాంగ ఎరువుల సమస్యపై పార్లమెంట్ ఆవరణలో తాము ధర్నాలు చేశామని, కేంద్రమంత్రిని కలిసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తులు చేశామని గుర్తుచేశారు. క్రికెట్‌లో నైట్ వాచ్‌మెన్‌ల మాదిరిగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. యూరియా సమస్యపై రోజుకోమాట మాట్లడుతున్నారని ఎద్దేవా చేశారు. సరిపడా యూరియా ఉంటే ఇప్పుడు రైతాంగం ఎందుకు ఇబ్బందులు పడుతోందని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ అధ్యక్షుడు మాట్లాడటం సరికాదని హితవు పలికారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.
20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు ఇచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఖరీఫ్ సీజన్‌కి ఇవ్వాల్సిన యూరియా గురించి మాట్లాడకుండా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎంత ఇచ్చారో కిషన్ రెడ్డి చెబుతున్నారని అన్నారు. ప్రతినెలా రాష్ట్రానికి ఇవ్వాల్సిన కోటా ఇవ్వకపోవడం వల్లే యూరియా సమస్య వచ్చిందని గుర్తుచేశారు. మూడు నెలల ముందు నుంచే సీఎం రేవంత్‌రెడ్డి, తామంతా కేంద్రమంత్రి దృష్టికి యూరియా సమస్యను తీసుకెళ్లామని వివరించారు.
అప్పుడు కేంద్రమంత్రి జేపీ నడ్డా కూడా సానుకూలంగా స్పందించిన సమస్యకు పరిష్కారం లభించలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు రాష్ట్ర సమస్యలపై పోరాటం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మూసీ ఆధునికీకరణ, మెట్రో ఫేజ్- 2, రీజినల్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావాలని సూచించారు. చిన్నచిన్న రాష్ట్రాలకు మెట్రో ప్రాజెక్టులు కేంద్రం ఇస్తోందని.. తెలంగాణకు మాత్రం మొండిచేయి ఎందుకు చూపిస్తోందని నిలదీశారు. కేవలం రాజకీయాలు చేయాలని, కాంగ్రెస్‌పై బురద జల్లే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు
Read Latest Telangana News And Telugu News