Share News

MLC Kavitha: కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దొంగ దీక్షలు చేయొద్దు.. కవిత విసుర్లు

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:57 AM

జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్ సార్ చెప్పే వారని పేర్కొన్నారు.

MLC Kavitha: కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో దొంగ దీక్షలు చేయొద్దు.. కవిత విసుర్లు
MLC Kavitha

హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : సామాజిక తెలంగాణ అంటే ఢిల్లీకి వెళ్లి వట్టిగా ధర్నాలు చేయడం కాదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శలు చేశారు. ఇవాళ(బుధవారం) తెలంగాణ జాగృతి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో జాగృతి జెండాను కవిత ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చెప్పినట్లుగా, వారి బాటలో తెలంగాణ జాగృతి ముందుకు వెళ్లిందని ఉద్ఘాటించారు. జయ శంకర్ సార్ ఆలోచనలను తూచా తప్పకుండా పాటించామని చెప్పుకొచ్చారు. తెలంగాణ చూడకుండానే జయ శంకర్ సార్ దూరం అయ్యారని స్మరించుకున్నారు ఎమ్మెల్సీ కవిత.


జయ శంకర్ సార్ జయంతి సందర్భంగా జాగృతి ఫౌండేషన్ డే జరుపుకుంటున్నామని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం పాటుపడాలని జయశంకర్ సార్ అనేక సార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నివర్గాల వారికి సమన్యాయం జరగాలని జయశంకర్ సార్ చెప్పే వారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి జై తెలంగాణ అని ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. బీసీల కోసం తాము హైదరాబాద్‌లో 72గంటల పాటు దీక్ష చేశామని ఉద్ఘాటించారు. కోర్టు నుంచి తమకు పర్మిషన్ రాలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో దొంగ దీక్షలు చేయడం కాదని, నిజమైన దీక్షలు చేయాలని హితవు పలికారు ఎమ్మెల్సీ కవిత.


జాగృతిలోకి వచ్చేందుకు చాలామంది రెడీగా ఉన్నారని.. తమకు అన్నివర్గాల మద్దతు వస్తోందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బీసీల కోసం కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చిత్తశుద్ధితో పని చేయటం లేదని మండిపడ్డారు. బీసీల కోసం జాగృతి కార్యచరణ సిద్ధం చేస్తోందని ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లపై బండి సంజయ్ మాట్లాడకపోతేనే విచిత్రమని ఎద్దేవా చేశారు. బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్‌లో ముస్లింలు ఉండవద్దని ముందు నుంచి బండి సంజయ్ మాట్లాడుతునే ఉన్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి ఒక్క పార్టీతో జై తెలంగాణ అనిపించామని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్‌లపై కాంగ్రెస్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని, అన్ని పార్టీల నాయకులకు లేఖలు రాయాలని సూచించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ తీసుకొని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు


ఈ వార్తలు కూడా చదవండి

కామారెడ్డి డిక్లరేషన్‌పై కాంగ్రెస్ మాట తప్పింది: బండి సంజయ్

చట్టవిరుద్ధ యాప్‌లకు ప్రమోషన్ ఎందుకు.. విజయ్ దేవరకొండ‌పై ఈడీ ప్రశ్నల వర్షం

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 12:03 PM