Minister Ponguleti Fires on BJP: బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుంది.. మంత్రి పొంగులేటి ఫైర్
ABN , Publish Date - Sep 11 , 2025 | 02:21 PM
42శాతం బీసీ రిజర్వేషన్లతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు. కామారెడ్డి బీసీ విజయోత్సవ బహిరంగ సభ విజయవంతం కోసం జనసమీకరణ ఏర్పాట్లపై చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అడ్డుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లోని మంత్రి పొంగులేటి నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ విజయోత్సవ బహిరంగ సభ విజయవంతం కోసం జనసమీకరణ ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు. 42శాతం బీసీ రిజర్వేషన్లతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉద్ఘాటించారు. బహుజన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు: బీర్ల ఐలయ్య
గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు కూడా ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రశ్నించారు. ఆలేరు నియోజకవర్గానికి 3700 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ప్రజా పాలనతో, బీర్ల ఫౌండేషన్ సహకారంతో పేదలకు ప్రోత్సాహం ఇస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పట్టుబట్టలు, పొట్టేలు బహుకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య.
ఆలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను పార్టీలకు అతీతంగా ఇస్తున్నామని మాటిచ్చారు. 2007లో వర్టూర్ గ్రామంలో దళిత వాడల్లో మాజీ సీఎం కేసీఆర్ పల్లెనిద్ర చేశారని గుర్తుచేశారు. అప్పుడు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని పేదలకు కేసీఆర్ చెప్పారని.. కానీ తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. పేదలను కేసీఆర్ నట్టేట ముంచారని మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుపోతోందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉంటే అధికారంలోకి వచ్చిన వారంలోపే బీఆర్ఎస్ నేతల అరెస్టులు ఉండేవని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసింది.. కేటీఆర్ ఫైర్
హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
For More TG News And Telugu News