Share News

Minister Komatireddy Venkata Reddy VS BRS: శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

ABN , Publish Date - Aug 31 , 2025 | 07:12 PM

ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని సభకు వచ్చి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్లపై, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Minister Komatireddy Venkata Reddy  VS BRS:  శిక్షలు తప్పించుకోడానికి హరీష్ రావు డ్రామాలు.. మంత్రి కోమటిరెడ్డి కౌంటర్
Minister Komatireddy Venkata Reddy VS BRS

హైదరాబాద్, ఆగస్టు31, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో శిక్ష తప్పించుకోవాలని మాజీ మంత్రి హరీష్‌రావు చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy) విమర్శించారు. బ్యారేజీల గురించి సభలో హరీష్‌రావు మాట్లాడాలని సూచించారు. కాళేశ్వరంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై ఇవాళ(ఆదివారం) తెలంగాణ అసెంబ్లీలో లఘుచర్చలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టిందని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో.. ఎలా కట్టాలో వారికి తెలీదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా కట్టింది కాబట్టే కూలిపోయిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని.. ఆమె కాళ్లు మొక్కి కేసీఆర్ వచ్చారని గుర్తుచేశారు. గతంలో అసెంబ్లీలో సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పారని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.


ప్రధాన ప్రతిపక్షనేత సభకు రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలడానికి తామే కారణమని అసెంబ్లీకి వచ్చి ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని హితవు పలికారు. బీసీ రిజర్వేషన్లపై, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ సభకు ఎందుకు రారని ప్రశ్నల వర్షం కురిపించారు. హరీష్‌రావు కోర్టు కేసుల గురించి సభలో మాట్లాడటం సరికాదని చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.


బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడ్డ దానిపై అసెంబ్లీలో చర్చ జరుగుతోందని తెలిపారు. కాళేశ్వరం కమిషన్ సబ్జెక్ట్‌పై హరీష్‌రావు మాట్లాడాలని సూచించారు. మళ్లీ అధికారంలోకి కేసీఆర్ వచ్చి ఉంటే మరో లక్ష కోట్లు దోచుకునేవారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు తప్పుచేశారు కాబట్టే హరీష్‌రావు ఇవన్నీ మాట్లాడుతున్నారని.. మాది తప్పయిందని ఒప్పుకోవాలని హితవు పలికారు. కేసీఆర్‌కు ఎదురుచెప్పే ధైర్యం ఎవరికీ లేకపోవడంతో ఇలా జరిగిందని చెప్పాలని అన్నారు. రేపు కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలు కూలితే ఏం చేయాలని నిలదీశారు. కోర్టు కేసుల గురించి అయితే తర్వాత మాట్లాడదామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అంటారా..?: మంత్రి శ్రీధర్ బాబు

Minister  Sridhar Babu SITHA App inauguration

మాజీ మంత్రి హరీష్‌రావు సభ సమయాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సూచించారు. ఎన్ని గంటలైనా మాట్లాడే, సభను నడిపే శక్తి యుక్తి తమకూ ఉందని ఉద్ఘాటించారు. హరీష్‌రావు వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సబ్జెక్ట్ ఉంటే మాట్లాడొచ్చని.. లేదంటే తమ వాళ్లు మాట్లాడతారని హితవు పలికారు. టెక్నికల్ అంశాలపై కోర్టుకు వెళ్లారని.. దాన్ని కోర్టు తేలుస్తుందని తెలిపారు. 1952 కమిషన్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం తాము కాళేశ్వరంపై కమిషన్ వేశామని వెల్లడించారు. ఏఐసీసీ సీనియర్ సభ్యులే ప్రస్తుతం మీ కేసు వాదిస్తున్నారని.. అది వారి వృత్తి అని గుర్తుచేశారు. అలాంటిది పీసీ ఘోష్ కమిషన్‌ను కాంగ్రెస్ కమిషన్ అంటారా? అని ఫైర్ అయ్యారు. తాము ప్రజాస్వామికంగా ముందుకు వెళుతున్నామని నొక్కిచెప్పారు. తాము కక్ష సాధింపు చేయాలి అనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలయ్యేవని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీజేపీ హక్కులను కొల్లగొడుతోంది.. మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

For More TG News And Telugu News

Updated Date - Aug 31 , 2025 | 07:42 PM