Mahesh Goud on Jubilee Hills Elections :జూబ్లీహిల్స్ ఎన్నిక.. సర్వే చేస్తున్నాం.. టికెట్ అలా నిర్ణయిస్తాం: మహేష్ కుమార్ గౌడ్
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:57 PM
ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఎన్నికలో (Jubilee Hills Elections) కాంగ్రెస్ (Congress) తప్పకుండా గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఒక్క సామాజికవర్గానికే కాకుండా అందరికీ సంక్షేమం, అభివృద్ధి అమలు చేస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సర్వేలు చేస్తున్నామని.. సర్వేలో ఎవరూ ముందుంటే వారికే సీటు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలిచే వారికి సీటు ఇస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఇవాళ(గురువారం) ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు మహేష్ కుమార్ గౌడ్.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలామంది రేసులో ఉన్నారని చెప్పుకొచ్చారు. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్ , బొంతు రామ్మోహన్‌లతో సహ పలువురు జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతున్నారని గుర్తుచేశారు. స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని తెలిపారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వస్తోందని చెప్పుకొచ్చారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తుచేశారు.
గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం చాలా బాగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన తెలంగాణ డీసీసీల అంశంపై సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ కొత్తగా ఎంపిక చేసిన 22 మంది అబ్జర్వర్లు హాజరవుతారని తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన 22 మంది అబ్జర్వర్లు తెలంగాణలో పర్యటిస్తారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
హైడ్రాతో సామాన్యుడికి ఇబ్బంది లేదు...
‘హైడ్రాతో సామాన్యుడికి ఇబ్బంది లేదు. కబ్జా చేసిన వారికే హైడ్రాతో ఇబ్బందులు. ప్రభుత్వ భూమి పోకుండా ఉండేలా హైడ్రా పని చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు హైడ్రా కూలగొట్టడానికి వెళ్లింది, కానీ కోర్టు ఆర్డర్ స్థానికులు తీసుకొచ్చారు ఆగిపోయింది. తన, మన భేదం లేకుండా హైడ్రా పని చేస్తోంది. పీసీసీ పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డికి, ఇన్‌చార్జ్ మీనాక్షి నటారాజన్‌కి తెలియకుండా చేశారని కొందరు గతంలో ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అయింది. బీఆర్‌ఎస్ మళ్లీ పునర్జీవం పోసుకోదు. ఏం చూసి బీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరిస్తారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి బీజేపీ నాయకులకు ఉంటే ఒక్కరోజులో బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపొచ్చు ’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కవితది ఆస్తుల పంచాయతీ..
‘గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నిటిపైన సీబీఐ విచారణ జరిపితే బాగుంటుంది. కవితది ఆస్తుల పంచాయితీ. కాంగ్రెస్‌తో కవితకు ఏలాంటి సంబంధం లేదు. కవితకు ప్రజల్లో ఏం ఇమేజ్ ఉంది ?. దోపిడీ చేసిన వారిని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు, అందరి వాయిస్‌లు రికార్డు చేశారు. నాది, రేవంత్‌రెడ్డిది రెండున్నరేళ్ల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది. నేను వాడిన జియో సిమ్ కార్డు నెంబర్ జియోసంస్థకు గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. జియో సంస్థకు రాసిన లేఖ కూడా దొరికింది. ఫోన్ ట్యాపింగ్ చేసి కేసీఆర్, కేటీఆర్ వ్యూహ రచన చేసి గత ఎన్నికల్లో గెలిచారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు.. క్లియర్ ఆధారాలు ఉన్నాయి’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
రాజగోపాల్ రెడ్డిపై హై కమాండ్ నిర్ణయం..
‘రాజగోపాల్ రెడ్డి అంశంలో హై కమాండ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. రేవంత్ రెడ్డి, రెడ్డి సామాజికవర్గం అయినప్పటికీ బీసీల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా చూశాను వారిలో మార్పు ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉంటారు. తెలంగాణ ఎన్నికల గెలుపులో రేవంత్ రెడ్డి పాత్ర ఉంది’ అని మహేష్ కుమార్ గౌడ్ ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
పార్టీ పరిశీలకులతో అగ్రనేతలు భేటీ
Read Latest Telangana News And Telugu News