Kishan Reddy MMTS: 22 ఏళ్ల నిరీక్షణకు తెర.. పూర్తి ఏసీ కోచ్‌లతో ఎంఎంటీఎస్ రైళ్లు..
ABN , Publish Date - Aug 17 , 2025 | 08:18 PM
హైదరాబాద్ నగరవాసులకు చల్లని కబురు వినిపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిచ్చే వార్త వెల్లడించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో.. సిటీలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను పూర్తి ఏసీ కోచ్‌లుగా మార్చనున్నట్లు ప్రకటించారు.
భాగ్యనగర వాసులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. గత రెండు దశాబ్దాలుగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలకు పరిష్కారం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైదరాబాద్ నగరవాసుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయ్. సాధారణంగా ప్రజలు ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణించేందుకు బస్సులు, ఆటోలు, సొంతవాహనాలు, మెట్రో, లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ నే ఆశ్రయిస్తుంటారు. అయితే, ట్రాఫిక్ రద్దీని భరించలేక ఇటీవల ఎక్కువమంది మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. కానీ, ఇది వరకంతా లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ దే హవా. ఈ లోటు పూడ్చేందుకు మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) రైళ్లను త్వరలోనే ఏసీ కోచ్‌లతో నడవనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన నగర వాసుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఎంఎంటీఎస్ రైళ్లకు గతవైభవం వస్తుందా?
హైదరాబాద్‌లో ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ముఖ్యపాత్ర పోషించే ఎంఎంటీఎస్ రైళ్లు.. మెట్రో రైలు రాకముందు చాలామంది ప్రయాణికులకు ప్రధానమైన ఆప్షన్‌గా ఉండేవి. కానీ ఆ తరువాత ఏసీ వసతులు కలిగిన మెట్రో రైళ్లకు ప్రయాణికులు ఆకర్షితులవడంతో ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఎంఎంటీఎస్ రైళ్లలో రోజుకు లక్షల మందికి పైగా ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం కేవలం 50 వేల మందే ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. ప్రధానంగా వేగం, సౌకర్యం, సమయపాలనలో లోపాలు, ఏసీ వసతి లేకపోవడం వంటి అంశాలు దీనికి కారణమని విశ్లేషణలు చెబుతున్నాయి.
22 ఏళ్ల నిరీక్షణకి తెర
22 సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్న ఏసీ కోచ్‌ల కల ఇప్పుడు నెరవేరబోతుంది. బొల్లారం, మేడ్చల్, ఘట్‌కేసర్, ఫలక్‌నుమా వంటి మెట్రో రైలు అందుబాటులో లేని మార్గాల్లో ప్రజలు ఎంఎంటీఎస్ సేవలపైనే ఆధారపడుతున్నారు. వీరికి ఇది ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. రోడ్డు మార్గంలో గంటల తరబడి ప్రయాణించాల్సిన పనిలేకుండా ఎంఎంటీఎస్ ద్వారా చాలా తక్కువ సమయంలోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఇకపై ఏసీ రైళ్లతో పాటు వేగవంతమైన ప్రయాణ అనుభూతి కూడా కలిగించనున్నట్లు సమాచారం.
హైటెక్స్‌లో జరిగిన క్రెడాయ్ సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నగరానికి సంబంధించి అనేక కీలక అంశాలు ప్రకటించారు. హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో పనులను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే సికింద్రాబాద్‌లో రూ.720 కోట్లతో రైల్వే అభివృద్ధి, హైదరాబాద్–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణం కూడా కేంద్ర ప్రణాళికలో భాగమని వెల్లడించారు. ఈ చర్యల వల్ల హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఎంఎంటీఎస్ సేవలతో పాటు మెట్రో, హైవేలు, విమానాశ్రయాల అభివృద్ధి ద్వారా నగర వాసులకు ట్రాఫిక్ భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రేవంత్ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు: కేటీఆర్
హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్