Government Whip Aadi Srinivas: హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారు : ఆది శ్రీనివాస్
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:44 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ కూలిందని హరీష్ రావుకు గుర్తు లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయవద్దని చేప్పిందని పేర్కొన్నారు.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాజీ మంత్రి హరీశ్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది మీరు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఆనాడే తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.. అని నిలదీశారు. ఆయన ఇవాళ(ఆదివారం) మీడియాతో మాట్లాడారు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే మేడిగడ్డ కూలిందని హరీష్ రావుకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయవద్దని చెప్పిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం కట్టింది మీ హయాంలోనే.. కూలింది కూడా మీ హయాంలోనే అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు బాంబులు పెట్టారని, కుట్ర చేశారని హరీష్ రావు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందు మీరు మీ పార్టీని చక్కదిద్దుకోవాలని సూచించారు. ఎప్పుడు నీళ్లు నింపాలో, ఎప్పుడు వదలాలో సీఎం రేవంత్ రెడ్డికి తెలుసని చెప్పుకొచ్చారు. మీ అవినీతి అక్రమాల వల్లనే కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. కాళేశ్వరం తెలంగాణకు గుది బండలా మారిందన్నారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వచేసి ఆ బ్యారేజ్ కొట్టుకుపోయి తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని హరీష్ రావు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తాము అన్ని ప్రాజెక్ట్‌లు నింపుతాం.. రైతులకు నీళ్లు ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావు బురద రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ