Home Mnister Anitha: వాయుగుండం.. టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:57 PM
బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. అది కాస్తా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
విశాఖపట్నం, ఆగస్టు 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ ఆల్పపీడనం కాస్తా సోమవారం వాయుగుండంగా బలపడి మరింతగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం విశాఖపట్నంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను కోరారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు. రహదారులపై చెట్లు పడితే.. వెంటనే వాటిని తొలగించాలన్నారు. అత్యవసరమైతే విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
ఇక కృష్ణానదికి వరద పోటెత్తిందన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్, ఔట్ ఫ్లో 2. 85 లక్షల క్యూసెక్కులు ఉందని వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నదిలో ప్రయాణించడం, చేపలు పట్టడం, ఈతకు వెళ్లడం లాంటివి చేయవద్దని ప్రజలకు హోమ్ మంత్రి సూచించారు. మరో వైపు గోదావరి నదికి సైతం వరద నీరు భారీగా చేరిందని చెప్పారు. ధవళేశ్వరం వద్ద 4.07 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హోమ్ మంత్రి మంత్రి అనిత సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ
For More AP News And Telugu News