GST 2.0- Market Response: మోదీ మ్యాజిక్‌తో రేపు మార్కెట్స్ దూసుకుపోవడం పక్కా.. ఎనలిస్టుల అంచనా
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:46 PM
ప్రధాని మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలతో రేపు స్టాక్ మార్కెట్స్ దూసుకుపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను ఎస్ అండ్ పీ సంస్థ పెంచడం, పుతిన్-ట్రంప్ మధ్య సానుకూల చర్చల వంటివన్నీ మార్కెట్‌లో జోష్ నింపుతాయని అంచనా వేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జీఎస్టీలో కీలక సంస్కరణలు తీసుకొస్తామంటూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో రేపు స్టాక్ మార్కెట్ దూసుకుపోవడం పక్కా అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలతో నిత్యావసర ధరలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పన్నులు ఎగ్గొట్టే ఘటనలూ తగ్గుముఖం పడతాయి. జీఎస్టీని మరింత మెరుగ్గా అమలు చేయడం సాధ్యమవుతుంది. ఇవన్నీ కలగలిసి స్టాక్ మార్కెట్‌కు ఊపునిస్తాయి.
ప్రధాని మోదీ ప్రకటనతో మార్కెట్‌లు దూసుకుపోతాయని పలువురు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ రేట్ల కోత ఈక్విటీలకు ఊతమిస్తుందని అంటున్నారు. ట్రంప్-పుతిన్ చర్చల ఫలితం కూడా రేపు మార్కెట్‌లపై ప్రభావం చూపనుంది. ఈ మీటింగ్‌లో ఎలాంటి ఒప్పందాలు కుదరకపోయినా.. మంచి పురోగతి సాధించామని ట్రంప్ ప్రకటించారు. ఇది మదుపర్లలో ఉత్సాహం నింపే అవకాశం ఉంది.
రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న సంకేతాల నడుమ భారత్‌పై కొత్త ఆంక్షల ముప్పు కూడా తక్కువేనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ రిటెయిల్ ఇన్వెస్టర్‌లకు నూతనోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సమావేశంపై కూడా మార్కెట్ వర్గాలు దృష్టి పెట్టాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరు, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు వంటివన్నీ భారతీయ స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని ఇప్పటికే ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ సంస్థ పేర్కొంది. భారత్ రేటింగ్స్‌ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి పెంచింది. ఆర్థిక పురోగతి స్థిరంగా ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ మార్కెట్‌కు సానుకూల అంశాలేనని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా భారత్ ఆర్థిక వ్యవస్థపై విదేశీ మదుపర్ల నమ్మకం పెరిగి పెట్టుబడులు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యాపార సంస్థలకు మేలు జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇన్‌పుట్ క్రెడిట్స్ మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం తలపెట్టిన మార్పులతో వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా ఇతర దేశాలకు గట్టి పోటీ ఇచ్చేలా భారత్ వస్తుసేవలను ఎగుమతి చేయగలుగుతుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి:
రాబోయే జీఎస్టీ సంస్కరణలు ఇవేనా.. ప్రజలకు ఇక పండగే
భారతీయ కరెన్సీలో చెల్లింపుల దిశగా ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం