Share News

KTR ON CM Revanth: రేవంత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఫ్యూచర్‌ లేదు: కేటీఆర్

ABN , Publish Date - Aug 17 , 2025 | 06:43 PM

సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన ఫ్యూచర్‌ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్‌(KTR) విమర్శించారు. రేవంత్ తన అవివేకంతో.. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు.

KTR ON CM Revanth: రేవంత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఫ్యూచర్‌ లేదు: కేటీఆర్
KTR

హైదరాబాద్‌: నగరంలోని ఫార్మాసిటీ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్ష నెరవేరదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫార్మాసిటీ భూముల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఇవాళ(ఆదివారం) మీడియాతో మాట్లాడారు.


సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన ఫ్యూచర్‌ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్‌(KTR) విమర్శించారు. రేవంత్ తన అవివేకంతో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేశారని మండిపడ్డారు. దాని స్థానంలో అవాస్తవ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీని ప్రవేశపెట్టారని ఆయన ధ్వజమెత్తారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.


గత ప్రభుత్వ హయాంలో 56 గ్రామాల పరిధిలో హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం 20వేల ఎకరాలతో ప్రతిపాదనలను తయారు చేశామని కేటీఆర్(KTR) తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రైతులు ముందుకు వచ్చి తమ భూములను ఫార్మాసిటీ కోసం ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు రైతన్నలు ఫార్మా కంపెనీలకు కేటాయించిన భూముల భవితవ్యంపై సందిగ్ధతలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి పేరిట అప్పట్లో ఇచ్చిన ఆ భూములు ఇప్పుడు వృథాగా మారినట్టు కనిపిస్తుండటం వారి ఆశల్ని ఆవిరిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద భూ కుంభకోణానికి తెర లేపిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్ తరఫున అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ

బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ

Updated Date - Aug 17 , 2025 | 08:36 PM