Share News

Harish Rao Fires on Congress: బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..  హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 05 , 2025 | 12:20 PM

అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు.

Harish Rao Fires on Congress: బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..  హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Harish Rao Fires on Congress

సంగారెడ్డి జిల్లా, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు హరీశ్. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ (ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా జడ్పీ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలే కేంద్రానికి ప్రాధాన్యమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని దుయ్యబట్టారు. ఆనాడు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలు ఏమయ్యాయి..? అని నిలదీశారు మాజీ మంత్రి హరీశ్‌రావు.


రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1,200... రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100లు మోదీ ప్రభుత్వం చేసిందని ఫైర్ అయ్యారు. 2017 నుంచి కొత్తగా జీఎస్టీ తెచ్చి పప్పు, ఉప్పు, సబ్బు, నూనె, షర్ట్, ప్యాంట్, టీవీ, సైకిల్, మోటార్, కారు ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ ప్రజలను ప్లాన్డ్‌గా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు కేసీఆర్, బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో యూరియా కోసం ఏనాడైనా ఇన్ని తిప్పలు పడ్డామా..? అని ప్రశ్నించారు. యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని నిలదీశారు. తెలంగాణ రైతులంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకి చిన్న చూపు అని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: మంత్రి ప్రభాకర్

Read Latest TG News And Telugu News

Updated Date - Oct 05 , 2025 | 03:41 PM