Etala Rajender Warning to Revanth: వారి జోలికొస్తే మాడి మసైపోతావ్.. రేవంత్ ప్రభుత్వానికి ఈటల మాస్ వార్నింగ్
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:14 PM
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
మేడ్చల్ , సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): హైడ్రా (HYDRA) అధికారులకు దమ్ముంటే ప్రభుత్వ స్థలంలో బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు తొలగించాలని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ (Etala Rajender) సవాల్ విసిరారు. హైడ్రా అధికారులు పేదల ఇల్లు కూలగొట్టి వారి జీవితాలతో చెలగాటమాడవద్దని హితవు పలికారు. కూడు, గూడు, గుడ్డ ఇవ్వాలని రాజ్యాంగం చెప్పిందని.. కానీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రం పేదల జోలికి రావడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్ రూం ఏమోకానీ.. 40 ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్న పేదల ఇళ్లు కూల్చారని ధ్వజమెత్తారు ఎంపీ ఈటల రాజేందర్.
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారంలోని ఐదు బస్తీల్లో ఉన్న పేదల ఇళ్లను కూలగొట్టింది హైడ్రా. కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులను ఇవాళ(సోమవారం) పరామర్శించారు ఈటల రాజేందర్. బస్తీలన్నీ కలియ తిరిగి బాధితులతో మాట్లాడి ధైర్య చెప్పారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే బాధితులకు కరెంటు, నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో తాతలు, తండ్రులు, ఇప్పుడు పిల్లలు ఉంటున్నారని చెప్పుకొచ్చారు. గుట్టలు, పుట్టలు ఉండి మనిషి ఉండే దిక్కులేనప్పుడు రూ. 5 వేలకు ఎకరం ఉన్న దగ్గరి నుంచి వీరు ఇక్కడ ఉంటున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా కంకర మిషన్ ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి వడ్డెరలు వచ్చారని చెప్పుకొచ్చారు ఎంపీ ఈటల రాజేందర్.
కంకర మిషన్ ఫ్యాక్టరీల్లో పనిచేసి కాళ్లు, చేతులు పొగొట్టుకొని మరీ పేదలు ఇక్కడ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 గజాల గుడిసెల్లో ఉండే వారి మీదనా హైడ్రా ప్రతాపమని హెచ్చరించారు. దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్లుగా.. దొంగ దెబ్బ తీసినట్లు.. పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి ఆదివారం వచ్చి పేదల ఇళ్లను కూలగొట్టారని ఫైర్ అయ్యారు. ఇళ్లను కూలగొట్టడంతో నిన్న రాత్రి అంతా ఆ పిల్లలతో వర్షంలోనే తడుస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు స్తంభాలు కూలగొట్టి, కరెంటు లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు. ఇక్కడి పేదల దీనాస్థితి చూసైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించాలని హితవు పలికారు. బ్రోకర్లను ఉరి తీయండి, అరెస్ట్ చేయండి.. కానీ 40 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న పేదల ఇళ్లను కూలగొట్టి ఆడబిడ్డలకు బతుకమ్మ సంబరాలు లేకుండా చేసి వారి కన్నీటిని చూశారని ధ్వజమెత్తారు ఎంపీ ఈటల రాజేందర్.
రూ. 15 వేల కోట్ల స్థలాలు కాపాడామని హైడ్రా అధికారులు అంటున్నారని.. కానీ ఇక్కడ ఉంది 300 గుడిసెలు, పేదల ఇళ్లని చెప్పుకొచ్చారు. పేదల ఇళ్లని కూలగొట్టి రూ.15 వేల కోట్ల స్థలాలు కాపాడామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి సిగ్గు ఉందా అని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా బస్తీ వాళ్లతో ప్రభుత్వం మాట్లాడాలని సూచించారు. నరసింహ బస్తీ, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీలో ఉన్నవారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లల పుస్తకాలు, ఇంట్లో సామాన్లను సైతం తొక్కించడంతో కన్నీరు మున్నీరవుతున్నాహైడ్రా అధికారులు కనీసం కనికరించడం లేదని మండిపడ్డారు. నిజాంలు, రాజులు కూడా ఇంత మూర్ఖంగా హైడ్రా అధికారుల మాదిరిగా ప్రవర్తించలేదని ఫైర్ అయ్యారు ఎంపీ ఈటల రాజేందర్.
శంకర్ హిల్స్ లాంటి ప్రాంతాల్లో వంద కోట్ల ఎకరాల ఉన్న భూములను కబ్జా చేస్తే హైడ్రా అధికారులు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నల వర్షం కురిపించారు. నోరు లేని వారిని, దిక్కు లేని వారిని, పేదరికంలో మగ్గుతున్న వారికి కన్నీళ్లు పెట్టిస్తే హైడ్రా అధికారులకు మంచి జరుగదని హితవు పలికారు. గాజులరామారంలోని పేదలు పరాయి వారు కాదని... పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాళ్లా..?.. భారతమాత బిడ్డలు కాదా..? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా పేదల ఇళ్లను కూలగొట్టడం ఆపాలని సూచించారు ఎంపీ ఈటల రాజేందర్.
గాజుల రామారంలో బ్రోకర్లు ఉంటే అరెస్ట్ చేయండి.. డబ్బులు రికవరీ చేయండి... కానీ పెదల జీవితాలతో ఆడుకోవద్దని కోరారు. పేదల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతాపం చూపొద్దని హితవు పలికారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల జోలికెళ్లడమేనా అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నా రూ.2500, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు కానీ పేదల గూడును మాత్రం చెదరగొడుతున్నారని మండిపడ్డారు. పేదల జోలికి వస్తే మాడి మసి అవుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి మీదనో కోపంతోని పేదల ఇళ్లను కూల్చవద్దని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే కూలగొట్టిన వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాకర్ బెయిల్ రద్దుపై సుప్రీం ఏం తేల్చిందంటే
సోషల్ మీడియాలో వార్తలపై హైడ్రా కమిషనర్ గుస్సా
Read Latest Telangana News And Telugu News