Share News

Harish Rao: నీళ్ల విషయంలో రేవంత్‌రెడ్డికి బాధ్యతలేదు.. హరీష్‌రావు ఫైర్

ABN , Publish Date - Jun 19 , 2025 | 06:17 PM

గోదావరి, కృష్ణా నీళ్లను ఏపీ వాడుకోమని సీఎం రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని మాజీ మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి దాసోహం అయ్యారని విమర్శించారు. నల్లమల ఏ జిల్లాల్లో ఉందో కూడా రేవంత్‌రెడ్డికి తెలియదని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

Harish Rao: నీళ్ల విషయంలో రేవంత్‌రెడ్డికి బాధ్యతలేదు.. హరీష్‌రావు ఫైర్
BRS MLA Harish Rao

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (Telangana CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ద్రోహం చేస్తోన్న రేవంత్‌రెడ్డిని ఏం చేసినా తప్పు లేదని అన్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో రేవంత్‌రెడ్డిది బాధ్యతారాహిత్యమేనని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి లెక్క తాము అడ్డదారిలో రాలేదు.. ఉద్యమం నుంచి వచ్చిన వాళ్లమని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. అఖిలపక్షా ఎంపీల సమావేశం పెట్టింది బనకచర్లను ఆపటానికా, కట్టుకోమని చెప్పటానికా అని ప్రశ్నించారు. ఇవాళ(గురువారం) తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో చిట్‌చాట్ చేశారు.


గోదావరిలో 1000, కృష్టాలో 500 టీఎంసీలు ఇచ్చి మిగిలిన నీటిని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లమని చెప్పటానికి రేవంత్‌రెడ్డి ఎవరని మాజీ మంత్రి హరీష్‌రావు నిలదీశారు. గోదావరి, కృష్ణా నీళ్లను ఏపీ వాడుకోమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి దాసోహం అయ్యారని విమర్శించారు. నల్లమల ఏ జిల్లాల్లో ఉందో కూడా రేవంత్‌రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా బేసిన్‌ల మీద బేసిక్ నాలెడ్జ్ కూడా రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో స్కూల్ పిల్లాడిని అడిగినా చెబుతాడని.. ఈ మాత్రం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. బనకచర్ల ఏ బేసిన్‌లో ఉందని రేవంత్‌రెడ్డి అధికారులను అడగటం సిగ్గుచేటని అన్నారు. రేవంత్‌రెడ్డి తేలికగా అబద్దాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్‌రావు.


ఉద్యమం చేయలేదు కాబట్టే.. రేవంత్‌రెడ్డికి నీటి విలువ తెలియదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా ఆరుమంత్రి పదవులకు రాజీనామా చేసిన చరిత్ర తమదని ఉద్ఘాటించారు. జగన్‌తో కేసీఆర్ మాట్లాడిన మాటలను రేవంత్‌రెడ్డి వక్రీకరించారని మండిపడ్డారు. నదీ మార్గం నుంచే నీళ్లు తేవాలని జగన్‌తో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగేలా మాట్లాడుకోవాలని మాత్రమే గతంలో కేసీఆర్ అన్నారని తెలిపారు. ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ప్రణాళికలను రచించుకోవాలని మాత్రమే జగన్‌తో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. సముద్రంలో కలుస్తున్న 3వేల టీఎంసీల్లో తెలంగాణకు 1950 టీఎంసీలు కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారని అన్నారు. సముద్రంలో కలిసే నీటిని ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని కేసీఆర్ ఎక్కడ చెప్పలేదని తేల్చిచెప్పారు మాజీ మంత్రి హరీష్‌రావు.


తెలంగాణ అంగీకారం లేకుండా నీటిని తీసుకెళ్తామంటే తాము ఒప్పుకోమని కేసీఆర్ స్పష్టం చేశారని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. వైఎస్ పెట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని రేవంత్‌రెడ్డి గతంలో అనలేదా అని ప్రశ్నించారు. 19నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా రేవంత్‌రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్‌ను ఇబ్బంది పెడుతున్నాయని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ కుప్పకూలిందని ఆక్షేపించారు. తెలంగాణ హక్కుల కోసం చిత్తశుద్ధితో పోరాడితే రేవంత్‌ ప్రభుత్వానికి సహకరిస్తామని..లేకపోతే రైతుల పక్షాన సుప్రీంకోర్టుకు వెళ్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో లోకేష్ భేటీ

యోగాలో ప్రపంచ రికార్డు సృష్టిస్తాం..: మంత్రి సవిత

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 06:23 PM