MP Etala Rajender On Tirumala: టీటీడీ ట్రస్టులో బంజారాలకు అవకాశం కల్పించాలి: ఎంపీ ఈటల రాజేందర్
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:51 AM
టీటీడీ ట్రస్టులో కూడా బంజారాలకు అవకాశం కల్పించాలని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హాథిరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఈటల రాజేందర్ ఆరోపించారు.
తిరుమల, అక్టోబరు19(ఆంధ్రజ్యోతి): టీటీడీ ట్రస్టు (TTD Trust)లో కూడా బంజారాలకు అవకాశం కల్పించాలని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Etala Rajender) కోరారు. హాథిరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. హాథిరాంజీ బాబా మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించాలని.. మిగిలిన భూములని కాపాడాలని కోరారు. ఈ మఠానికి సంబంధించిన బాధ్యతలు బంజారాలకి అప్పగించాలని విన్నవించారు ఎంపీ ఈటల రాజేందర్. తిరుమల వేంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy)ని బంజారా సంఘం నేతలు, ఎంపీలు ఈటల రాజేందర్, బలరాం నాయక్, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతోట్ రామచందర్ నాయక్, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ ఇవాళ(ఆదివారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ మాట్లాడారు.
హాథిరాంజీ మఠాన్ని అభివృద్ధి చేయాలి: సీతారామ్ నాయక్
హాథిరాంజీ బాబా మఠాన్ని టీటీడీ అభివృద్ధి చేయాలని సీతారామ్ నాయక్ కోరారు. తిరుమలను ఈ స్థాయికి తీసుకువచ్చిన హాథిరాంజీ మఠం అభివృద్ధిని టీటీడీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వేంకటేశ్వర స్వామి వారిని ఆరాధించే హక్కు 12 కోట్ల జనాభా ఉన్న బంజారాలకు ఉందని గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారని గుర్తుచేశారు. హాథిరాంజీ మఠానికి గతంలో ట్రస్టు బోర్డు నియమించాలన్న ప్రతిపాదన ఎందుకు అమలు కాలేదని నిలదీశారు. తిరుపతిలో ఉన్న హాథిరాంజీ మఠాన్ని కూల్చి వేయాలని చేస్తున్నారని ఆరోపించారు సీతారామ్ నాయక్.
హాథిరాంజీ మఠాన్ని రక్షించుకునేందుకు తామంతా తిరుమలకు వచ్చామని వివరించారు. శ్రీవారికి అత్యంత పవిత్ర భక్తుడు హాథిరాంజీ బాబా అని ఉద్ఘాటించారు. హాథిరాంజీ బాబా కేవలం వేంకటేశ్వర స్వామి భక్తుడిగా కాకుండా సంరక్షకుడిగానూ పని చేశారని కొనియాడారు. ఇప్పుడు వీఐపీలు రావచ్చుగాని.. ఆనాడు స్వామి వారిని హాథిరాంజీ బాబా కంటికి రెప్పలాగా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. భక్తులు సమర్పించే కానుకలు కూడా హాథిరాంజీకి చెందేలా స్వామి వారు స్వయంగా ఆదేశించారని పేర్కొన్నారు. హాథిరాంజీ బాబా చరిత్ర కనుమరుగు కాకుండా ట్రస్టును కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని సీతారామ్ నాయక్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కవిత
పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం
Read Latest Telangana News and National News