Priyanka Gandhi: ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి కారణమిదే.. ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:10 PM
ఓట్ల రక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రజలకు మోదీ, అమిత్ షాలపై నమ్మకం పోయిందని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ప్రభుత్వం (BJP Government), ప్రధానమంత్రి నరేంద్రమోదీపై (PM Narendra Modi) ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓట్లను చోరీ చేసి గెలుస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్'పై మహా ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొని ప్రసంగించారు ప్రియాంక గాంధీ.
కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, బీహార్‌లో ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. ఓటుకు రూ. 10వేలు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ ప్రజల ఆత్మవిశ్వాసం కోల్పోయారని ఆక్షేపించారు. మోదీ తప్పు చేశారు కాబట్టే పార్లమెంట్‌లో తాము మాట్లాడుతుంటే తమ కళ్లలోకి కళ్లు పెట్టి కూడా చూడలేరని విమర్శించారు ప్రియాంక గాంధీ.
ప్రజలకు మోదీ, అమిత్ షాలపై నమ్మకం పోయిందని ఎద్దేవా చేశారు. దేశం ఐక్యంగా ఉండటం, న్యాయం కోసం రాహుల్‌గాంధీ 8 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వయసులో కూడా ప్రజల కోసం పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఓట్ల రక్షణ, రాజ్యాంగ, ప్రజాస్వామ్య రక్షణ కోసం తాము పోరాడుతామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
కాగా, ఎన్నికల్లో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు, ఈసీ - బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో ఈరోజు (ఆదివారం) మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా 'ఓట్ చోర్, గద్దీ ఛోడ్' నినాదంతో జరిగిన ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితర జాతీయ నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మెస్సి ఈవెంట్ నిర్వాహకుడు శతద్రుకు బెయిల్ నిరాకరణ
విమానంలో అమెరికా మహిళకు అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి