Dr. Anjali Nimbalkar: విమానంలో అమెరికా మహిళకు అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:54 PM
విమానంలో అస్వస్థతకు గురయిన ఓ అమెరికా ప్రయాణికురాలిని కర్ణాటక కాంగ్రెస్ నేత డా. అంజలి నింబాల్కర్ కాపాడారు. వెంటనే సీపీఆర్ చేసి ఆమెను రక్షించారు. ఆమె సేవా తత్పరతను చూసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రశంసలు కురిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: విమానంలో అస్వస్థతకు గురయిన అమెరికన్ మహిళ ప్రాణాలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ డా. అంజలి నింబాల్కర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా డా.అంజలిని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. ఆమెది నిస్వార్థ సేవ అని కొనియాడారు. శనివారం గోవా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ ఘటన జరిగింది (Dr. Anjali Nimbalkar perform CPR on American womon aboard flight).
విమానం బయలుదేరిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. కాలిఫోర్నియాకు చెందిన జెన్నీ అనే ప్రయాణికురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన డా. అంజలి వెంటనే స్పందించి ఆమెకు సీపీఆర్ చేశారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. దాదాపు గంటన్నర పాటు డా. అంజలి ప్రయాణికురాలి పక్కనే ఉంటూ ఆమె ఆరోగ్య పరిస్థితిని కనిపెట్టుకుని ఉన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా మారేలా చికిత్స అందించారు. ఇక విమానం ఢిల్లీలో ల్యాండయ్యాక సిబ్బంది అమెరికా మహిళను ఆసుపత్రికి తరలించారు.
డా. నింబాల్కర్ సేవా తత్పరత తనను కదిలించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా ప్రశంసించారు. ఆమె సమయస్ఫూర్తి, సహృదయతను చూసి గర్వపడుతున్నానని అన్నారు. రాజకీయాల్లో బిజీగా మారి వైద్య వృత్తికి విరామం ఇచ్చినప్పటికీ ఈ ఉదంతంతో డా. నింబాల్కర్ నిబద్ధత స్పష్టమైందని అన్నారు.
మరోవైపు, కర్ణాటక కాంగ్రెస్ కూడా డా. అంజలి నింబాల్కర్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రజాసేవలో ఆమె అద్భుత మానవత్వం, ధైర్యం కనబరిచారని ప్రశంసించింది. క్లిష్ట సమయంలో సీపీఆర్ చేసి రోగి ప్రాణాలు నిలిపారని తెలిపింది. ప్రజాసేవకు అధికారం, హోదాలతో సంబంధం లేదన్న విషయం ఈ ఉదంతంతో మరోసారి స్పష్టమైనదని కామెంట్ చేసింది. కాంగ్రెస్ విలువలకు ఆమె చర్య ప్రతిబింబంగా నిలిచిందని ప్రశంసించింది. మరోవైపు, ఆన్‌లైన్‌లో కూడా ఈ ఉదంతంపై ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. డా.అంజలి 2018-23 మధ్యకాలంలో ఖానాపూర్ ఎమ్మెల్యేగా సేవలందించారు.
ఇవి కూడా చదవండి
నైట్ క్లబ్స్‌లో బాణసంచాపై నిషేధం.. గోవా కీలక నిర్ణయం
మహారాష్ట్రలో చిరుత కలకలం.. భవనాల మధ్య దూకుతూ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి