Goa Fireworks Ban: నైట్ క్లబ్స్‌లో బాణసంచాపై నిషేధం.. గోవా కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:15 PM
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల కోసం గోవాకు పర్యాటకులు పోటెత్తనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి నైట్ క్లబ్ అగ్నిప్రమాదం తరహా ఘటనలు పునరావృతం కాకుండా నైట్ క్లబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్‌లో బాణసంచాపై నిషేధం విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సర, క్రిస్మస్ వేడుకలకు గోవా సిద్ధమవుతున్న తరుణంలో నైట్ క్లబ్ అగ్నిప్రమాద ఘటన కలకలానికి దారి తీసింది. ఈ ఘటనలో 25 మంది మృతి చెందడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న హాలిడే సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నైట్ క్లబ్స్, రెస్టారెంట్స్, హోటల్స్‌లో బాణసంచాను నిషేధించింది. ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది (Goa Ban on Fire Works).
సంప్రదాయక బాణసంచాతో పాటు ఎలక్ట్రానిక్ ఫైర్ వర్క్స్, నిప్పుతో చేసే ఇతర ప్రదర్శనలు, ఫైర్ గేమ్స్‌ను నిషేధించినట్టు గోవా ప్రభుత్వం వెల్లడించింది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో గోవాకు పర్యాటకుల తాకిడి పతాకస్థాయికి చేరనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిషేధం విధించినట్టు వెల్లడించింది.
డిసెంబర్ 6న జరిగిన నైట్ క్లబ్ అగ్నిప్రమాదం తరువాత పర్యాటక రంగంలో ఆందోళన రేకెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థల బలోపేతం, నిబంధనల అమలుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల నైట్ క్లబ్ అగ్నిప్రమాదం తరహా దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అన్ని డిపార్ట్‌మెంట్‌లు, టూరిజం రంగ సంస్థలు ఈ విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉండే బీచ్‌లు, జలపాతాలున్న ప్రాంతాలు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అగ్నిప్రమాద నివారణకు సంబంధించిన నిబంధనల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అనుమతించిన వేళల్లోనే మద్యాన్ని విక్రయించాలని హోటల్స్, రెస్టారెంట్స్, క్లబ్స్, నైట్ క్లబ్స్‌ను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
మహారాష్ట్రలో చిరుత కలకలం.. భవనాల మధ్య దూకుతూ..
శశిథరూర్‌కు వీరసావర్కర్ అవార్డు... తీసుకోవడంలేదన్న ఎంపీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి